Halloween Costume ideas 2015

Faith in God

నిజమైన విశ్వాసమంటే? (ప్రతి విశ్వాసి తప్పక చదవండి)


నేటి దినాలలో ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా అని ఎలా చెప్తున్నారు అంటే,
ఆ వ్యక్తి అడిగింది దేవుడు అనుగ్రహించినప్పుడు అతనిలో విశ్వాసం వుందని, అడిగింది యివ్వకపోతే అతనిలో విశ్వాసం లేదని చెప్తున్నారు. ఈ మధ్య కొందరి బోధలు ఇలానే వున్నాయి. నీవు విశ్వాసంతో అడుగు “ఏదైనా” దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరుడా నీవు అడిగింది దేవుడు ఇవ్వలేదని నీలో విశ్వాసం లేదని అనుకోకు, ప్రక్కవారు అడిగింది దేవుడు యిస్తున్నంత మాత్రాన వారు నిజమైన విశ్వాసులు అనుకోకు. మరి నిజమైన విశ్వాసం అంటే ఏంటి? నిజమైన విశ్వాసులు ఎవరో ఇపుడు చూద్దాము.
నేను అడిగింది దేవుడు యివ్వగలడా? ఆయన యిది చేయగలడా? ఆయన స్వస్థపరచగలడా? అసలు ఎలా చేయగలడు? ఆయనకు సాధ్యమేనా అని దేవుని శక్తి మీద, దేవుని కార్యాల మీద సందేహం కలిగి వుండడం నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే నేను ఆరాధిస్తున్న యేసు క్రీస్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన తప్ప యింకో రక్షకుడు లేడు, ఆయనకు సమస్తం సాధ్యమే, నేను అడిగింది యివ్వుటకు ఆయన సమర్ధుడు, అయితే నేను అడిగింది తనకు ఇష్టం (చిత్తం) అయితే యిస్తాడు. లేకపోతే ఇవ్వడు అని శ్రమలలో కూడా నమ్మకం కలిగి వుండడం నిజమైన విశ్వాసం… యిట్టి విశ్వాసం మనం షడ్రకు, మేషకు, అబెద్నగోలో చూడగలము. (దానియేలు 3 వ అధ్యాయం)

నెబుకద్నేజరు రాజు తాను నిలబెట్టిన బంగారు ప్రతిమ కు పూజింపనందుకు షడ్రకు, మేషకు, అబెద్నగో ముగ్గురిని కూడా అగ్ని గుండంలో పడవేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ ముగ్గురు కూడా నెబుకద్నేజరుతో అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్ని గుండంలో నుండి రక్షించుటకు సమర్ధుడు, ఒకవేళ ఆయన రక్షింపక పోయినా నీ దేవతలను మేము పూజింపము అంటున్నారు. (దానియేలు 3:17,18). యిక్కడ వారు దేవుని శక్తిని ఏమాత్రం సందేహించటంలేదు. ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్ధుడు. అయినప్పటికీ తన చిత్తం అయితే రక్షిస్తాడు, లేకపోతే రక్షించడు, రక్షించిన ఆయనే మా దేవుడు, రక్షించకపోయిన కూడా ఆయనే మా దేవుడు అనే భావం వారిలో కనపడుతుంది. ఈ రోజు నీలో అట్టి విశ్వాసం ఉందా? అడుగుతుంది యిస్తున్నంతవరకు మేలులు అనుభవిస్తున్నంతవరకు దేవున్ని స్తుతిస్తూ మహాభక్తులుగా కనపడుతూ కాస్త శ్రమలు రాగానే, బాధలు రాగానే దేవుణ్ణి దూషించే వారు స్తుతి చేయడం మానేసేవారు ఎంతమంది లేరు? యోబు భార్య కూడా అంతే. మేలుని అనుభవించినంతసేపు బాగావుంది, కీడు రాగానే దేవుణ్ణి దూషించమని తన భర్తకు సలహా యిస్తుంది. (యోబు 2:6-10)… ఈరోజు ఎంతమంది యోబు భార్యలాగా లేరు? నిజమైన విశ్వాసులు ఎవరో శ్రమలు వచ్చినప్పుడు బయటపడతారు. ఈ రోజుల్లో కాస్త శ్రమలు, బాధలు రాగానే ఒక పక్క చర్చికు వస్తూనే మరో పక్క అన్యదేవతలను పూజిస్తున్నవారు ఎంతమంది లేరు? తల నొప్పి తీస్తుందని రాగి కడ్డీలు పెట్టించుకోవడం, జీవితం బాగా వుండాలని రంగు ఉంగరాలు ధరించడం, సంతానం కలగట్లేదని విగ్రహాలకి టెంకాయలు కొట్టడం, పిల్లలకు దిష్టి తగులుతుందని త్రాడులు, తాయత్తులు కట్టడం, జాబ్ రావట్లేదని స్నేహితుల మాటలు విని విగ్రహారాధన పనులు చేస్తున్నారు ఎందరో. యింకా యిలాంటివి ఎన్నో… సగం విగ్రహారాధన, సగం క్రైస్తవ్యం… యిదేమి విశ్వాసం? అంటే వీరెవరు కూడా క్రీస్తు ఒక్కడే దేవుడు అని నమ్మలేదు, మా జీవితాలను మార్చుటకు సమర్ధుడు, ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదు అనే నమ్మకం వీరిలో లేదు. వీరెవరు కూడా నిజమైన విశ్వాసులు కారు. యిట్టి వారందరూ కూడా నరకముకే వెళ్తారు (ప్రకటన 21:8).
“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” హెబ్రీ 11:6.

మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, గద్దిస్తారు, చేరదీస్తారు, తిడ్తారు, కొన్ని సార్లు అడిగింది యివ్వరు…. వాళ్ళు మన కోరికలు, ఇష్టాలు తీరుస్తున్నంత వరకు మా తల్లిదండ్రులని, గద్దించినప్పుడు, కొట్టినప్పుడు, అడిగింది యివ్వనప్పుడు మా తల్లిదండ్రులు కాదని అంటామా? అనలేము. అదే విధంగా నీవు యేసు క్రీస్తు ఒక్కడే నా పాపాలను క్షమించేవాడు, ఆయన తప్ప యింకో రక్షకుడు లేడని నీవు విశ్వసిస్తే కష్టనష్టాలు వచ్చిన ఆయనే నా పరలోకపు తండ్రి అంటావు. అడిగింది ఇవ్వనంత మాత్రాన నా పరలోకపు తండ్రి కాదు అని అనలేవు… యింకా నా పరలోకపు తండ్రి ఈ శరీర సంబంధులు తండ్రులు కంటే, గొప్పవాడు, ప్రేమగల వాడు, తన శిక్షలో న్యాయం ఉంటుంది. శ్రమలలో ఉంచిన, అడిగింది యిచ్చినా – యివ్వకపోయినా అంతా నా మేలు కొరకే అని దేవున్ని స్తుతిస్తావు. యిది నిజమైన విశ్వాసం…. యిట్టి విశ్వాసం కలిగినవారు నిజమైన విశ్వాసులు (హెబ్రీ 12:5-10 ; 11:1,6 ; 1 పేతురు 4:6 ; 5:6-11).
ఈ విశ్వాసం మీలో ఉందా? ఒకసారి పరీక్షించుకోండి, యిట్టి విశ్వాసం మన అందరికి కలుగును గాక. ఆమెన్.
“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. ” హెబ్రీ 11:1.






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget