యెరికో గోడలు
యెరికో గోడలు అలా ఎందుకు కూలిపోతున్నాయి? ఏదో ఒక పెద్ద బాంబు వాటిని కూల్చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ రోజుల్లో బాంబులు లేవు; కనీసం తుపాకులైనా లేవు. అది యెహోవా చేసిన మరో అద్భుత కార్యం! అసలు అది ఎలా జరిగిందో చూద్దాం.
యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: ‘నువ్వు, నీతోపాటు నీ యుద్ధశూరులు పట్టణం చుట్టూ తిరగాలి. రోజుకు ఒకసారి చొప్పున ఆరు రోజులు తిరగాలి. మీతోపాటు నిబంధన మందసాన్ని తీసుకు వెళ్ళాలి. ఏడుగురు యాజకులు దాని ముందు నడుస్తూ తమ బూరలు ఊదాలి.
‘ఏడవ రోజున పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. తర్వాత బూరలు ఊదుతూ ప్రతి ఒక్కరు యుద్ధ కేకలు వేయాలి. అప్పుడు గోడలు కూలిపోతాయి!’
యెహోషువ, ప్రజలు యెహోవా చెప్పినట్లు చేశారు. వాళ్ళు పట్టణం చూట్టూ తిరిగేటప్పుడు నిశ్శబ్దంగా నడిచారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కేవలం బూరల శబ్దం, వాళ్ళ అడుగుల చప్పుడు మాత్రమే వినిపించింది. యెరికోలోని దేవుని ప్రజల శత్రువులు తప్పకుండా భయపడి ఉంటారు. ఒక కిటికీలోనుండి వ్రేలాడుతున్న ఎర్రని తాడు మీకు కనిపించిందా? ఆ కిటికీ ఎవరిది? అవును, రాహాబు ఆ ఇద్దరు వేగులవాళ్ళు చెప్పినట్లు చేసింది. ఆమె కుటుంబమంతా ఆమెతోపాటు ఇంట్లోనే ఉండి ఎదురు చూశారు.
చివరకు ఏడవ రోజున పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగిన తర్వాత, యాజకులు బూరలు ఊదారు, యుద్ధశూరులు కేకలు వేశారు, గోడలు కూలిపోయాయి. అప్పుడు యెహోషువ, ‘పట్టణంలోని ప్రతి ఒక్కరిని చంపేసి, పట్టణాన్ని కాల్చివేయండి. పూర్తిగా కాల్చివేయండి. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుమును మాత్రం మిగిల్చి యెహోవా గుడారపు ధనాగారములో ఉంచండి’ అని చెప్పాడు.
ఆ ఇద్దరు వేగులవాళ్ళతో యెహోషువ, ‘మీరు రాహాబు ఇంటికి వెళ్ళి, ఆమెను ఆమె ఇంటివారిని బయటకు తీసుకొని రండి’ అని చెప్పాడు. వేగులవాళ్ళు వాగ్దానం చేసినట్లు రాహాబు, ఆమె కుటుంబం రక్షించబడింది.
యెహోషువ 6:1-25.
ప్రశ్నలు
- యుద్ధశూరులు మరియు యాజకులు ఆరు రోజులపాటు ఏమి చేయాలని యెహోవా చెప్పాడు?
- ఆ పురుషులు ఏడవ రోజున ఏమి చేయాలి?
- మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా యెరికో గోడలకు ఏమి జరిగింది?
- ఒక కిటికీలోనుండి ఎర్ర తాడు ఎందుకు వ్రేలాడుతోంది?
- యెరికోలోని ప్రజలను మరియు ఆ పట్టణాన్ని ఏమి చేయమని, కానీ వెండిని, బంగారాన్ని, ఇత్తడిని, ఇనుమును ఏమి చేయమని యెహోషువ యుద్ధశూరులకు చెప్పాడు?
- ఇద్దరు వేగులవాళ్ళకు ఏమి చేయమని చెప్పబడింది?
అదనపు ప్రశ్నలు
- యెహోషువ 6:1-25 చదవండి.ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ ఏడు రోజులపాటు తిరగడం, ఈ అంత్యదినాల్లో యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా పనికి ఎలా పోలివుంది? (యెహో. 6:15, 16; యెష. 60:22; మత్త. 24:14; 1 కొరిం. 9:16)యెహోషువ 6:26లో వ్రాయబడిన ప్రవచనం దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎలా నెరవేరింది, అది మనకు యెహోవా వాక్యం గురించి ఏమి బోధిస్తోంది? (1 రాజు. 16:34; యెష. 55:11)
Post a Comment