దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
అబ్రాహాము ఏమి చేస్తున్నాడో కనిపిస్తోందా? ఆయన దగ్గర కత్తి ఉంది, ఆయన తన కుమారుణ్ణి చంపబోతున్నట్లు కన్పిస్తోంది. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు? మొదట, అబ్రాహాముకు శారాకు కుమారుడెలా పుట్టాడో చూద్దాం.
దేవుడు వాళ్ళకు కుమారుడు పుడతాడని వాగ్దానం చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి. కానీ అబ్రాహాము శారా చాలా వృద్ధులైపోయారు కాబట్టి అది అసాధ్యం అనిపించింది. అయితే అసాధ్యం అనిపించేదాన్ని దేవుడు సాధ్యం చేయగలడని అబ్రాహాము నమ్మాడు. అది ఎలా జరిగింది?
దేవుడు వాగ్దానం చేసి ఒక సంవత్సరం గడిచిపోయింది. అబ్రాహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకు ఇస్సాకు అనే మగ పిల్లవాడు పుట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు!
అయితే ఇస్సాకు పెద్దవాడైనప్పుడు యెహోవా అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన ‘అబ్రాహామా’ అని పిలిచినప్పుడు, అబ్రాహాము ‘చిత్తం ప్రభువా’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు దేవుడు ఆయనతో, ‘నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నేను నీకు చూపించబోయే పర్వతానికి తీసుకొని వెళ్ళి అక్కడ అతనిని చంపి బలిగా అర్పించు’ అని చెప్పాడు.
తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించిన అబ్రాహాముకు ఆ మాటలు ఎంత దుఃఖాన్ని కలిగించి ఉంటాయో కదా. అబ్రాహాము పిల్లలు కనాను దేశంలో నివసిస్తారని దేవుడు వాగ్దానం చేశాడని గుర్తుంచుకోండి. కానీ ఇస్సాకు చనిపోతే అది ఎలా నెరవేరుతుంది? ఆ విషయం అబ్రాహాముకు అర్థం కాకపోయినా, ఆయన దేవునికి విధేయత చూపించాడు.
అబ్రాహాము ఆ పర్వతంపైకి చేరుకున్న తర్వాత, ఇస్సాకును కట్టేసి తాను నిర్మించిన బలిపీఠంపై అతనిని పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఆయన తన కుమారుణ్ణి చంపేందుకు కత్తి బయటకు తీశాడు. అయితే అదే క్షణంలో దేవుని దూత ‘అబ్రాహామా, అబ్రాహామా’ అని పిలిచినప్పుడు, అబ్రాహాము ‘చిత్తం ప్రభువా’ అన్నాడు.
‘చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు; అతనినేమీ చేయవద్దు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించడానికి నువ్వు వెనుకాడ లేదు కాబట్టి నీకు నాపై విశ్వాసముందని నాకు తెలిసింది’ అని దేవుడు చెప్పాడు.
అబ్రాహాముకు దేవునిపై ఎంత గొప్ప విశ్వాసముందో కదా! యెహోవాకు అసాధ్యమైనదేదీ లేదని, ఆయన ఇస్సాకును మృతులలోనుండి కూడా లేపగలడని అబ్రాహాము నమ్మాడు. నిజానికి అబ్రాహాము ఇస్సాకును చంపాలన్నది దేవుని ఉద్దేశం కాదు. అందుకే దేవుడు దగ్గర్లో ఉన్న పొదల్లో ఒక గొర్రె చిక్కుకొనేలా చేసి, తన కుమారునికి బదులు దానిని అర్పించమని అబ్రాహాముకు చెప్పాడు.
ఆదికాండము 21:1-7; 22:1-18.
ప్రశ్నలు
- దేవుడు అబ్రాహాముకు ఏమని వాగ్దానం చేశాడు, దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడు?
- చిత్రంలో కనిపిస్తున్నట్లు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని ఎలా పరీక్షించాడు?
- దేవుడు అలా ఆజ్ఞాపించడానికి కారణం తెలియకపోయినా అబ్రాహాము ఏమి చేశాడు?
- అబ్రాహాము తన కుమారుణ్ణి చంపడానికి కత్తి బయటకు తీసినప్పుడు ఏమి జరిగింది?
- అబ్రాహాముకు దేవునిపై ఉన్న విశ్వాసం ఎంత బలమైనది?
- బలిగా అర్పించడానికి దేవుడు అబ్రాహాముకు ఏమి ఏర్పాటు చేశాడు, ఎలా చేశాడు?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 21:1-7 చదవండి.అబ్రాహాము ఎనిమిదవ రోజున తన కుమారుడికి ఎందుకు సున్నతి చేశాడు? (ఆది. 17:10-12; 21:4)
- ఆదికాండము 22:1-18 చదవండి.ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముకు ఎలా విధేయత చూపించాడు, అది భవిష్యత్తులో జరగబోయే మరింత గమనార్హమైన సంఘటనకు పూర్వఛాయగా ఎలా ఉంది? (ఆది. 22:7-9; 1 కొరిం. 5:7; ఫిలి. 2:8, 9)
Post a Comment