మండుతున్న పొద
మోషే తన గొర్రెలను మేపడానికి హోరేబు పర్వతం వరకు వచ్చాడు. అక్కడ ఆయనకు ఒక పొద మండుతూ కనిపించింది, కానీ అది కాలిపోలేదు!
‘వింతగా ఉందే, దగ్గరకు వెళ్ళి అదేంటో చూద్దాం’ అని మోషే అనుకున్నాడు. అలా వెళ్ళే సరికి, ‘దగ్గరకు రావద్దు. నీ చెప్పులు విడువు, నువ్వు నిలబడివున్న స్థలం పరిశుద్ధమైనది’ అని పొదలో నుండి ఒక స్వరం వినిపించింది. దేవుడే తన దూత ద్వారా అలా మాట్లాడుతున్నాడు కాబట్టి మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు.
దేవుడు ఆయనతో, ‘ఐగుప్తులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూశాను. కాబట్టి నేను వాళ్ళను విడిపించబోతున్నాను, వాళ్ళను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను నిన్నే పంపించబోతున్నాను’ అని చెప్పాడు. యెహోవా తన ప్రజలను అందమైన కనాను దేశానికి తీసుకురావాలనుకున్నాడు.
అందుకు మోషే, ‘నేను ఎంతమాత్రపు వాడిని. నేను దాన్నెలా చేయగలను? ఒకవేళ నేను వెళ్ళినా, ఇశ్రాయేలీయులు “నిన్ను ఎవరు పంపించారు?” అని అడిగితే నేనేమి చెప్పాలి?’ అని అడిగాడు.
అప్పుడు దేవుడు, ‘అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నన్ను పంపించాడు అని నువ్వు చెప్పాలి. నిరంతరము నా పేరు ఇదే’ అని చెప్పాడు.
‘నువ్వు నన్ను పంపించావని నేను చెప్పినా, వాళ్ళు నమ్మకపోతే ఎలా’ అని మోషే అడిగాడు.
‘నీ చేతిలో ఉన్నది ఏమిటి?’ అని దేవుడు అడిగాడు.
‘కర్ర’ అని మోషే సమాధానమిచ్చాడు.
‘దాన్ని నేల మీద పడెయ్యి’ అని దేవుడు చెప్పాడు. మోషే అలా పడేసినప్పుడు అది పాముగా మారింది. అప్పుడు యెహోవా మోషేకు మరో అద్భుతాన్ని చూపించాడు. ‘నీ చెయ్యి నీ వస్త్రం చాటున ఉంచు’ అని ఆయన అన్నాడు. మోషే తన చేతిని అలా ఉంచి తీసినప్పుడు అది తెల్లని మంచులా మారింది! ఆ చేతికి కుష్ఠరోగం వచ్చినట్లు కనిపించింది. ఆ తర్వాత యెహోవా, మూడో అద్భుతాన్ని చేయడానికి మోషేకు శక్తినిచ్చాడు. చివరగా ‘నువ్వు ఈ అద్భుతాలను చేస్తే, నేను నిన్ను పంపానని ఇశ్రాయేలీయులు నమ్ముతారు’ అని ఆయన చెప్పాడు.
ఆ తర్వాత మోషే ఇంటికి వెళ్ళి యిత్రోతో, ‘నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వస్తాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వు’ అని అడిగాడు. వెంటనే యిత్రో మోషేకు వీడ్కోలు చెప్పాడు, తర్వాత మోషే ఐగుప్తుకు తిరుగు ప్రయాణం ఆరంభించాడు.
నిర్గమకాండము 3:1-22; 4:1-20.
ప్రశ్నలు
- చిత్రంలోని పర్వతం పేరు ఏమిటి?
- మోషే తన గొర్రెలతోపాటు ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు చూసిన వింతను వర్ణించండి.
- మండుతున్న పొదలోనుండి వినపడిన స్వరం ఏమని చెప్పింది, ఆ స్వరం ఎవరిది?
- తన ప్రజలను ఐగుప్తునుండి బయటకు తీసుకురావాలని దేవుడు చెప్పినప్పుడు మోషే ఎలా ప్రతిస్పందించాడు?
- మోషేను ఎవరు పంపించారని ప్రజలు అడిగితే, ఏమి చెప్పమని దేవుడు చెప్పాడు?
- దేవుడే తనను పంపించాడని మోషే ఎలా నిరూపించుకోగలడు?
అదనపు ప్రశ్నలు
- నిర్గమకాండము 3:1-22 చదవండి.ఒకానొక దైవపరిపాలనా నియామకాన్ని నిర్వహించడానికి మనం అర్హులము కాదు అని మనకు అనిపించినా, యెహోవా మనకు సహాయం చేస్తాడని మోషే అనుభవం మనకు ఎలా హామీ ఇస్తోంది? (నిర్గ. 3:11, 13; 2 కొరిం. 3:5, 6)
- నిర్గమకాండము 4:1-20 చదవండి.మోషే మిద్యానులో గడిపిన 40 సంవత్సరాల్లో ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చింది, సంఘంలో ఆధిక్యతలను చేపట్టడానికి అర్హులయ్యేందుకు కృషి చేస్తున్నవారు దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (నిర్గ. 2:11, 12; 4:10, 13; మీకా 6:8; 1 తిమో. 3:1, 6, 10)యెహోవా తన సంస్థ ద్వారా మనకు క్రమశిక్షణ ఇచ్చినా, మోషే ఉదాహరణ మనకు ఏ హామీ ఇస్తోంది? (నిర్గ. 4:12-14; కీర్త. 103:14; హెబ్రీ. 12:4-11)
Post a Comment