ఆరాధన కోసం ఒక గుడారం
ఈ కట్టడం ఏమిటో మీకు తెలుసా? అది యెహోవాను ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన గుడారం. అది మందిరం అని కూడా పిలువబడేది. ప్రజలు ఐగుప్తును విడిచి వచ్చిన ఒక సంవత్సరానికి దాన్ని నిర్మించడం పూర్తి చేశారు. దాన్ని నిర్మించమని ఎవరు చెప్పారో తెలుసా?
యెహోవా చెప్పాడు. మోషే సీనాయి పర్వతంపై ఉన్నప్పుడు, దాన్నెలా నిర్మించాలో యెహోవా ఆయనకు చెప్పాడు. దానిని సులభంగా విడదీసేలా చేయమని ఆయన చెప్పాడు. అలా చేయడం ద్వారా, దాని భాగాలను మరో చోటికి తీసుకెళ్ళి, తిరిగి జోడించడం సాధ్యమయ్యేది. కాబట్టి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమతోపాటు ఆ గుడారాన్ని తీసుకొని వెళ్ళేవారు.
గుడారానికి చివర్లోవున్న చిన్న గది లోపలికి చూస్తే, అక్కడ ఒక పెట్టె లేక భోషాణం కనిపిస్తుంది. దానిని నిబంధన మందసం అంటారు. దానిపైన రెండు చివర్లలో బంగారంతో చేయబడిన రెండు దూతలు లేక కెరూబులు ఉండేవి. మొదట ఇవ్వబడిన రెండు రాతి పలకలను మోషే పగలగొట్టాడు కాబట్టి దేవుడు మళ్ళీ రెండు రాతి పలకలపై పది ఆజ్ఞలను వ్రాశాడు. ఆ రాతి పలకలు నిబంధన మందసంలో ఉంచబడేవి. అంతేగాక, మన్నాగల ఒక పాత్ర కూడా అందులో ఉండేది. మన్నా అంటే ఏమిటో మీకు జ్ఞాపకముందా?
యెహోవా మోషే అన్నయైన అహరోనును ప్రధాన యాజకునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. ఆయనే యెహోవా ఆరాధనలో ప్రజలను నడిపించేవాడు. ఆయన కుమారులు కూడా యాజకులే.
ఇప్పుడు గుడారంలోని పెద్ద గదిని చూడండి. ఆ గది చిన్న గది కంటే రెండింతలు పెద్దగా ఉండేది. దానిలోవున్న ఒక చిన్న పెట్టె లేక భోషాణంనుండి పొగ పైకి రావడం కనిపించిందా? అక్కడే యాజకులు ధూపద్రవ్యమని పిలువబడే మంచి సువాసనగల పదార్థంతో ధూపం వేసేవారు. ఆ తర్వాత ఆ గదిలో ఏడు దీపాలుగల ఒక దీపస్తంభం ఉండేది. ఆ గదిలో ఉన్న మూడవది బల్ల. దానిమీద 12 రొట్టెలు ఉంచబడేవి.
ఆ మందిరపు ఆవరణలో నీళ్ళతో నింపబడిన పెద్ద గంగాళం ఉండేది. యాజకులు తమను తాము శుభ్రపరచుకోవడానికి దానిలోని నీళ్ళను ఉపయోగించుకునేవారు. అక్కడ ఒక పెద్ద బలిపీఠము కూడా ఉండేది. అక్కడ చంపబడిన జంతువులను యెహోవాకు అర్పణగా కాల్చేవారు. ఆ గుడారం పాళెం మధ్యలో ఉండేది. దాని చుట్టూ ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని నివసించేవారు.
నిర్గమకాండము 25:8-40; 26:1-37; 27:1-8; 28:1; 30:1-10, 17-21; 34:1, 2; హెబ్రీయులు 9:1-5.
ప్రశ్నలు
- చిత్రంలో కనిపిస్తున్న కట్టడం ఏమని పిలువబడేది, అది దేనికోసం ఉపయోగించబడేది?
- సులభంగా విడదీసేలా గుడారాన్ని నిర్మించమని యెహోవా మోషేకు ఎందుకు చెప్పాడు?
- గుడారానికి చివర్లోవున్న చిన్న గదిలోని పెట్టె ఏమిటి, ఆ పెట్టెలో ఏమి ఉండేవి?
- ప్రధాన యాజకుడిగా ఉండడానికి యెహోవా ఎవరిని ఎన్నుకున్నాడు, ప్రధాన యాజకుడు ఏమి చేసేవాడు?
- గుడారంలోని పెద్ద గదిలోవున్న మూడు వస్తువుల పేర్లు చెప్పండి.
- మందిరపు ఆవరణలోవున్న రెండు వస్తువులు ఏమిటి, అవి దేనికోసం ఉపయోగించబడేవి?
అదనపు ప్రశ్నలు
- నిర్గమకాండము 25:8-40; 26:1-37; 27: 1-8; 28:1 చదవండి.“శాసనములుగల మందసము” పైన ఉండే కెరూబులు దేనిని సూచిస్తున్నాయి? (నిర్గ. 25:20, 22; సంఖ్యా. 7:89; 2 రాజు. 19:15)
- నిర్గమకాండము 30:1-10, 17-21; 34:1, 2; హెబ్రీయులు 9:1-5 చదవండి.గుడారంవద్ద సేవచేస్తున్న యాజకులు శారీరక పరిశుభ్రతను కాపాడుకోవలసిన ప్రాముఖ్యతను యెహోవా ఎందుకు నొక్కి చెప్పాడు, అది నేడు మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి? (నిర్గ. 30:18-21; 40:30, 31; హెబ్రీ. 10:22)అపొస్తలుడైన పౌలు తాను హెబ్రీయులకు లేఖ వ్రాసే సమయానికి గుడారం మరియు ధర్మశాస్త్ర నిబంధన వాడుకలో లేవని ఎలా చూపించాడు? (హెబ్రీ. 9:1, 9; 10:1)
Post a Comment