ఒక చెడ్డరాజు ఐగుప్తును పరిపాలించడం
ఇక్కడున్న మనుష్యులు ప్రజలతో బలవంతంగా పని చేయిస్తున్నారు. పని చేసేవాళ్ళలో ఒకరిని కొరడాతో కొడుతున్న మనిషిని చూడండి! పని చేస్తున్నవాళ్ళు యాకోబు కుటుంబీకులు, వాళ్ళు ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు. వాళ్ళతో బలవంతంగా పనిచేయిస్తున్న మనుష్యులు ఐగుప్తీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు దాసులయ్యారు. అది ఎలా జరిగింది?
యాకోబు పెద్ద కుటుంబం చాలా సంవత్సరాలు ఐగుప్తులో సమాధానంగా జీవించింది. ఫరో రాజు తర్వాత ఐగుప్తులో అత్యంత ప్రముఖుడిగా ఉన్న యోసేపు వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత యోసేపు మరణించాడు. ఇశ్రాయేలీయులంటే ఇష్టంలేని ఒక క్రొత్త ఫరో ఐగుప్తుకు రాజయ్యాడు.
కాబట్టి ఆ చెడ్డ ఫరో ఇశ్రాయేలీయులను దాసులుగా చేసుకున్నాడు. అతను నిర్దయులైన, క్రూరులైన వ్యక్తులను వాళ్ళ మీద అధికారులుగా ఉంచాడు. వాళ్ళు ఫరో కోసం పట్టణాలను నిర్మించడానికి ఇశ్రాయేలీయులను ఎంతో కష్టపెట్టి బలవంతంగా పని చేయించేవారు. అయినా ఇశ్రాయేలీయులు మాత్రం సంఖ్యలో విస్తారంగా పెరుగుతూ వచ్చారు. కొంతకాలమయ్యేసరికి, ఇశ్రాయేలీయుల సంఖ్య బాగా పెరిగిపోయి, వాళ్ళు ఎంతో బలంగలవారిగా తయారవుతారేమోనని ఐగుప్తీయులు భయపడ్డారు.
అప్పుడు ఫరో ఏమి చేశాడో మీకు తెలుసా? అతను ఇశ్రాయేలీయులైన తల్లులకు మంత్రసాని పనిచేసే స్త్రీలతో మాట్లాడి ‘వాళ్ళకు పుట్టే ప్రతి మగపిల్లవాడిని చంపండి’ అని చెప్పాడు. అయితే ఆ స్త్రీలు మంచివాళ్ళు కాబట్టి పిల్లలను చంపకుండా విడిచిపెట్టారు.
అప్పుడు ఫరో, ‘ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపేయండి. ఆడపిల్లలను మాత్రమే బ్రతకనివ్వండి’ అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. అది ఘోరమైన ఆజ్ఞ కదా? అయితే ఒక మగ పిల్లవాడు ఎలా కాపాడబడ్డాడో మనం చూద్దాం.
నిర్గమకాండము 1:6-22.
ప్రశ్నలు
- చిత్రంలో కొరడా పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు, అతను ఎవరిని కొడుతున్నాడు?
- యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?
- ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూసి ఎందుకు భయపడ్డారు?
- ఇశ్రాయేలీయులైన తల్లులకి మంత్రసాని పనిచేసే స్త్రీలకు ఫరో ఏమని ఆజ్ఞాపించాడు?
అదనపు ప్రశ్నలు
- నిర్గమకాండము 1:6-22 చదవండి.యెహోవా తాను అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చడం ప్రారంభించాడు? (నిర్గ. 1:7; ఆది. 12:2; అపొ. 7:17)హీబ్రూ మంత్రసానులు జీవానికున్న పవిత్రతను ఎలా గౌరవించారు? (నిర్గ. 1:17; ఆది. 9:6)మంత్రసానులు యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు ఎలా ఆశీర్వదించబడ్డారు? (నిర్గ. 1:20, 21; సామె. 19:17)అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన సంతానం విషయంలో దేవుని సంకల్పాన్ని ఆటంకపరచాలని సాతాను ఎలా ప్రయత్నించాడు? (నిర్గ. 1:22; మత్త. 2:16)
Post a Comment