భిన్నమైన కవల పిల్లలు
ఇక్కడున్న ఇద్దరు అబ్బాయిలు ఎంతో భిన్నంగా ఉన్నారు కదా? వాళ్ళ పేర్లు మీకు తెలుసా? వేటాడుతున్నవాడు ఏశావు, గొర్రెలను కాస్తున్నవాడు యాకోబు.
వాళ్ళిద్దరూ ఇస్సాకు రిబ్కాలకు పుట్టిన కవల పిల్లలు. తండ్రియైన ఇస్సాకుకు ఏశావంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే అతను మంచి వేటగాడైవుండి కుటుంబమంతటికి ఆహారం తెచ్చిపెట్టేవాడు. కానీ రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించేది, ఎందుకంటే ఆయన నెమ్మదస్థుడు, శాంత స్వభావం గలవాడు.
వాళ్ళ తాతయ్య అబ్రాహాము అప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన యెహోవా గురించి చెబుతుంటే వినడానికి యాకోబు ఎంత ఇష్టపడేవాడో మనం ఊహించవచ్చు. ఆ కవల పిల్లలకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రాహాము 175 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
ఏశావు 40 సంవత్సరాల వాడైనప్పుడు కనాను దేశపు స్త్రీలను ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. అది ఇస్సాకుకు రిబ్కాకు ఎంతో దుఃఖం కలిగించింది, ఎందుకంటే ఆ స్త్రీలు యెహోవా ఆరాధకులు కాదు.
అలా ఉండగా ఒకరోజు ఏశావుకు యాకోబుమీద చాలా కోపం తెప్పించిన సంఘటన ఒకటి జరిగింది. ఇస్సాకు తన పెద్దకుమారుడికి దీవెన ఇచ్చే సమయం వచ్చింది. యాకోబు కంటె ఏశావే పెద్దవాడు కాబట్టి తానే ఆ ఆశీర్వాదాన్ని పొందుతానని ఏశావు అనుకున్నాడు. అయితే ఏశావు అంతకు ముందే ఆ ఆశీర్వాదాన్ని పొందే హక్కును యాకోబుకు అమ్మేశాడు. అంతేగాక, వాళ్ళిద్దరు పుట్టినప్పుడే ఆ ఆశీర్వాదాన్ని యాకోబు పొందుతాడని దేవుడు చెప్పాడు. అలాగే జరిగింది. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును ఆశీర్వదించాడు.
తర్వాత ఏశావుకు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి యాకోబుమీద చాలా కోపం వచ్చింది. అతనికి ఎంత కోపం వచ్చిందంటే అతను యాకోబును చంపుతానని అన్నాడు. రిబ్కాకు ఆ విషయం తెలిసినప్పుడు ఆమె ఎంతో బాధపడింది. కాబట్టి ఆమె తన భర్తతో ఇలా అన్నది: ‘యాకోబు కూడా కనాను స్త్రీలను పెళ్ళి చేసుకుంటే ఘోరంగా ఉంటుంది.’
అప్పుడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబును పిలిచి, ‘నువ్వు కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు. హారానులో ఉన్న మీ తాతయ్య బెతూయేలు ఇంటికి వెళ్ళి, ఆయన కుమారుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకో’ అని చెప్పాడు.
యాకోబు తండ్రి మాట విని, వెంటనే తన బంధువులు నివసించే హారానుకు ప్రయాణం ప్రారంభించాడు.
ఆదికాండము 25:5-11, 20-34; 26:34, 35; 27:1-46; 28:1-5; హెబ్రీయులు 12:16, 17.
ప్రశ్నలు
- ఏశావు యాకోబులు ఎవరు, వాళ్ళు ఎలా భిన్నంగా ఉండేవారు?
- ఏశావు యాకోబుల తాత అబ్రాహాము చనిపోయినప్పుడు వాళ్ళ వయసు ఎంత?
- ఏశావు తన తల్లిదండ్రులకు బాధ కలిగించే ఏ పని చేశాడు?
- ఏశావుకు తన సహోదరుడైన యాకోబుపై ఎందుకు కోపం వచ్చింది?
- ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు ఏమి చెప్పాడు?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 25:5-11, 20-34 చదవండి.రిబ్కాకు పుట్టిన ఇద్దరు కుమారుల గురించి యెహోవా ఏమని ప్రవచించాడు? (ఆది. 25:23)జ్యేష్ఠత్వము విషయంలో యాకోబుకున్న వైఖరికి, ఏశావుకున్న వైఖరికి మధ్య ఎలాంటి తేడా ఉంది? (ఆది. 25:31-34)
- ఆదికాండము 26:34, 35; 27:1-46; 28:1-5 చదవండి.ఏశావు ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా ఎంచలేదని ఎలా స్పష్టమయ్యింది? (ఆది. 26:34, 35; 27:46)యాకోబు యెహోవా ఆశీర్వాదం పొందడానికి ఏమి చేయాలని ఇస్సాకు చెప్పాడు? (ఆది. 28:1-4)
- హెబ్రీయులు 12:16, 17 చదవండి.పరిశుద్ధమైనవాటిని తృణీకరించే వారి పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఏశావు ఉదాహరణ ఎలా చూపిస్తోంది?
Post a Comment