యోబు దేవునికి నమ్మకంగా ఉండడం
వ్యాధితో బాధపడుతున్న ఈ వ్యక్తిని చూస్తే మీకు జాలేస్తోందా? ఆయన పేరు యోబు, ఆ స్త్రీ ఆయన భార్య. ఆమె యోబుతో ఏమంటోందో మీకు తెలుసా? ‘దేవున్ని దూషించి చనిపో’అంటోంది. ఆమె ఎందుకు అలా అన్నదో, యోబు ఎందుకు అంత బాధ అనుభవించాడో చూద్దాం.
యోబు యెహోవాకు విధేయత చూపిన నమ్మకస్థుడు. ఆయన కనానుకు ఎంతో దూరంలోలేని ఊజు దేశంలో నివసించేవాడు. యెహోవా యోబును ఎంతో ప్రేమించాడు, కానీ ఒక వ్యక్తి ఆయనను ఎంతో ద్వేషించాడు. అతనెవరో తెలుసా?
అతను అపవాదియైన సాతాను. సాతాను యెహోవాను ద్వేషించే చెడ్డ దూతని మీకు జ్ఞాపకముంది కదా. అతను ఆదాము హవ్వలు యెహోవాకు అవిధేయత చూపేలా చేయగలిగాడు, అంతేగాక మిగతా వాళ్ళందరు కూడా యెహోవాకు అవిధేయత చూపేలా తాను చేయగలనని అనుకున్నాడు. అయితే అతను అలా చేయగలిగాడా? లేదు. మనం తెలుసుకున్న అనేకమంది నమ్మకస్థులైన స్త్రీ పురుషులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళలో ఎంతమంది పేర్లను మీరు చెప్పగలరు?
యాకోబు, యోసేపు ఐగుప్తులో చనిపోయిన తర్వాత భూమి అంతటిలో యెహోవాకు ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి యోబు ఒక్కడే. సాతాను అందరిని చెడ్డవారిగా చేయలేడనే సంగతిని అతనికి తెలియజేయాలని యెహోవా అతనితో ‘యోబును చూడు. ఆయన నాకెంత నమ్మకంగా ఉన్నాడో చూడు’అన్నాడు.
అందుకు సాతాను ‘ఆయనకు నువ్వు అన్నీ ఇచ్చి ఆశీర్వదించావు కాబట్టే ఆయన నమ్మకంగా ఉన్నాడు. కానీ వాటన్నిటిని తీసేస్తే, ఆయన నిన్ను దూషిస్తాడు’అని వాదించాడు.
అప్పుడు యెహోవా ‘నువ్వు వెళ్ళి అవన్నీ లేకుండా చెయ్యి. యోబుకు నువ్వు చేయాలనుకున్నంత కీడు చెయ్యి. ఆయన నన్ను దూషిస్తాడేమో చూద్దాం. కానీ ఆయనను చంపవద్దు’అని చెప్పాడు.
సాతాను మొదటిగా, యోబు పశువులూ ఒంటెలూ దొంగిలించబడేలా, ఆయన గొర్రెలు చచ్చిపోయేలా చేశాడు. తర్వాత తుఫానులో ఆయన 10 మంది కుమారులను కుమార్తెలను చంపేశాడు. ఆ తర్వాత సాతాను యోబును భయంకరమైన వ్యాధితో మొత్తాడు. యోబు ఎంతో బాధననుభవించాడు. అందుకే యోబు భార్య ఆయనతో, ‘దేవుని దూషించి చనిపో’అన్నది. కానీ యోబు అలా చెయ్యలేదు. అంతేగాక ముగ్గురు కపట స్నేహితులొచ్చి ఆయన చాలా చెడుగా జీవించినందువల్లనే అలా జరిగిందని అన్నారు. అయినా యోబు నమ్మకంగానే ఉన్నాడు.
అది యెహోవాను ఎంతో సంతోషపరచింది. తర్వాత మీకు ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు ఆయన యోబును ఆశీర్వదించాడు. దేవుడు ఆయన వ్యాధిని బాగు చేశాడు. యోబుకు మళ్ళీ 10 మంది అందమైన పిల్లలు పుట్టారు. పశువులు, గొర్రెలు, ఒంటెలు ముందున్న వాటికంటే రెండింతలు ఎక్కువగా లభించాయి.
మీరు కూడా యోబులాగే యెహోవాకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటారా? అలా ఉంటే, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ భూమంతా ఏదెను తోటలా అందంగా చేయబడినప్పుడు మీరు అందులో నిరంతరం జీవించగలుగుతారు.
యోబు 1:1-22; 2:1-13; 42:10-17.
ప్రశ్నలు
- యోబు ఎవరు?
- సాతాను ఏమి చేయడానికి ప్రయత్నించాడు, అతనలా చేయగలిగాడా?
- సాతాను ఏమి చేసేందుకు యెహోవా అనుమతించాడు, ఎందుకు అనుమతించాడు?
- యోబు భార్య ఆయనతో ‘దేవున్ని దూషించి చనిపో’అని ఎందుకు అన్నది? (చిత్రం చూడండి.)
- రెండవ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా యెహోవా యోబును ఎలా ఆశీర్వదించాడు, ఎందుకు ఆశీర్వదించాడు?
- మనం కూడా యోబులాగే యెహోవాకు నమ్మకంగా ఉంటే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?
అదనపు ప్రశ్నలు
- యోబు 1:1-22 చదవండి.నేడు క్రైస్తవులు యోబును ఎలా అనుకరించవచ్చు? (యోబు 1:1; ఫిలి. 2:14; 2 పేతు. 3:14)
- యోబు 2:1-13 చదవండి.సాతాను హింసకు యోబు, ఆయన భార్య ఎలా విభిన్నంగా ప్రతిస్పందించారు? (యోబు 2:9, 10; సామె. 19:3; మీకా 7:7; మలా. 3:14)
- యోబు 42:10-17 చదవండి.నమ్మకంగా జీవించినందుకు యోబుకు లభించిన ప్రతిఫలానికి, యేసుకు లభించిన ప్రతిఫలానికి ఉన్న సారూప్యతలు ఏమిటి? (యోబు 42:12; ఫిలి. 2:9-11)దేవునిపట్ల తన యథార్థతను కాపాడుకున్నందుకు యోబుకు లభించిన ఆశీర్వాదాలనుబట్టి మనకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది? (యోబు 42:10, 12; హెబ్రీ. 6:10; యాకో. 1:2-4, 12; 5:11)
Post a Comment