రాహాబు వేగులవాళ్ళను దాచిపెట్టడం
ఈ మనుష్యులు ఆపదలో ఉన్నారు. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకపోతే చంపబడతారు. వాళ్ళు ఇశ్రాయేలీయుల వేగులవాళ్ళు, వాళ్ళకు సహాయం చేస్తున్న స్త్రీ రాహాబు. ఆమె యెరికో పట్టణపు గోడపై ఉన్న ఇంట్లో నివసించేది. ఈ మనుష్యులు ఎందుకు ఆపదలో ఉన్నారో చూద్దాం.
ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటి కనానులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళు వెళ్ళేముందు యెహోషువ ఇద్దరు వేగులవాళ్ళను పంపించాడు. ‘వెళ్ళి ఆ దేశాన్ని, యెరికో పట్టణాన్ని చూసి రండి’ అని ఆయన వాళ్ళకు చెప్పాడు.
ఆ వేగులవాళ్ళు యెరికోకు వెళ్ళి రాహాబు ఇంటికి వెళ్ళారు. అయితే ఎవరో యెరికో రాజుకు, ‘మన దేశాన్ని వేగు చూడడానికి ఇద్దరు ఇశ్రాయేలీయులు వచ్చారు’ అని చెప్పారు. ఆ మాట వినగానే రాజు రాహాబు ఇంటికి మనుష్యులను పంపించాడు. వాళ్ళు రాహాబుతో, ‘నీ ఇంట్లోవున్న మనుష్యులను బయటకు తీసుకురా!’ అని ఆజ్ఞాపించారు. రాహాబు వేగులవాళ్ళను తన ఇంటి మిద్దెపై దాచిపెట్టింది. ఆమె తన ఇంటికి వచ్చిన మనుష్యులతో, ‘కొంతమంది మనుష్యులు నా ఇంటికి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడి వాళ్ళో నాకు తెలియదు. చీకటి పడుతున్నప్పుడు, పట్టణపు తలుపులు వేయకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళితే వాళ్ళను పట్టుకోవచ్చు!’ అని చెప్పింది. ఆ మనుష్యులు వాళ్ళను వెంటాడి పట్టుకోవాలని వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోగానే రాహాబు తన ఇంటి మిద్దెపైకి వెళ్ళింది. అప్పుడు ఆమె, ‘యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని నాకు తెలుసు. మీరు ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు ఆయన ఎర్ర సముద్రం ఎండిపోయేలా చేశాడని, మీరు సీహోను, ఓగు రాజులను చంపారని మేము విన్నాము. నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఉపకారము చేస్తామని మాట ఇవ్వండి. నా తండ్రిని, తల్లిని, నా అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను కాపాడండి’ అని ఆ వేగులవాళ్ళను కోరింది.
వేగులవాళ్ళు అలా చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆమె ఒక పని చెయ్యాలని వాళ్ళు చెప్పారు. ‘నువ్వు ఈ ఎర్ర తాడును ఇంటి కిటికీకి కట్టు. నీ బంధువులనందరిని ఈ ఇంటిలోకి చేర్చుకో. మేము యెరికోను స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఇంటి కిటికీలోనుండి వ్రేలాడే తాడును చూసి ఇందులోవున్న వాళ్ళను ఎవ్వరిని చంపము’ అని చెప్పారు. ఆ తర్వాత వేగులవాళ్ళు తిరిగి వెళ్ళి జరిగిన సంగతిని యెహోషువకు చెప్పారు.
యెహోషువ 2:1-24; హెబ్రీయులు 11:31.
ప్రశ్నలు
- రాహాబు ఎక్కడ నివసించేది?
- చిత్రంలోని ఇద్దరు పురుషులు ఎవరు, వాళ్ళు యెరికోకు ఎందుకు వెళ్ళారు?
- యెరికో రాజు రాహాబుకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడు, ఆమె ఏమని సమాధానమిచ్చింది?
- రాహాబు ఆ ఇద్దరు పురుషులకు ఎలా సహాయం చేసింది, ఆమె వాళ్ళనుండి ఏ ఉపకారము కోరింది?
- వేగులవాళ్ళు రాహాబుకు ఏమని వాగ్దానం చేశారు?
అదనపు ప్రశ్నలు
- యెహోషువ 2:1-24 చదవండి.నిర్గమకాండము 23:27లో నమోదు చేయబడిన యెహోవా వాగ్దానం, ఇశ్రాయేలీయులు యెరికోకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఎలా నెరవేరింది? (యెహో. 2:9-11)
- హెబ్రీయులు 11:31 చదవండి.రాహాబు ఉదాహరణ, విశ్వాసంయొక్క ప్రాముఖ్యతను ఎలా నొక్కి చెప్పింది? (రోమా. 1:17; హెబ్రీ. 10:39; యాకో. 2:25)
Post a Comment