మోషే అహరోనులు ఫరోను కలవడం
మోషే ఐగుప్తుకు తిరిగి వచ్చి, ఆ అద్భుతాలన్నింటి గురించి తన అన్న అహరోనుతో చెప్పాడు. మోషే అహరోనులు ఆ అద్భుతాలను ఇశ్రాయేలీయులకు చూపించినప్పుడు యెహోవా వాళ్ళకు తోడుగా ఉన్నాడని ప్రజలందరూ నమ్మారు.
అప్పుడు మోషే అహరోనులు ఫరోను కలవడానికి వెళ్ళారు. వాళ్ళు అతనితో, ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, “నా ప్రజలు నన్ను అరణ్యములో ఆరాధించడానికి మూడు రోజులు వాళ్ళను వెళ్ళనివ్వు” అని కోరుతున్నాడు’ అని చెప్పారు. అందుకు ఫరో, ‘యెహోవాను నేను నమ్మను. ఇశ్రాయేలీయులను పోనివ్వను’ అని సమాధానమిచ్చాడు.
యెహోవాను ఆరాధించడానికి పనినుండి సెలవియ్యమని ప్రజలు కోరుతున్నందుకు ఫరోకు కోపం వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని వాళ్ళను బలవంతపెట్టాడు. ఫరో తమతో అలా కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ఇశ్రాయేలీయులు మోషేను నిందించారు, మోషే బాధపడ్డాడు. అయితే యెహోవా ఆయనకు చింతించవద్దని చెప్పాడు. ‘ఫరో నా ప్రజలను పోనిచ్చేలా నేను చేస్తాను’ అని కూడా యెహోవా చెప్పాడు.
మోషే అహరోనులు మళ్ళీ ఫరో దగ్గరకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక అద్భుతం చేశారు. అహరోను తన కర్రను క్రింద పడెయ్యగానే అది పెద్ద పాము అయ్యింది. ఫరో జ్ఞానులు కూడా తమ కర్రలను క్రింద పడేశారు, అప్పుడు అవి కూడా పాములయ్యాయి. కానీ చూడండి! అహరోను పాము ఆ జ్ఞానుల పాములను మ్రింగేసింది. అయినా ఫరో ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు.
యెహోవా ఫరోకు గుణపాఠం నేర్పించవలసిన సమయం వచ్చింది. ఆయన ఫరోకు గుణపాఠం ఎలా నేర్పించాడో తెలుసా? ఐగుప్తుమీదకు 10 తెగుళ్ళను అంటే గొప్ప కష్టాలను తీసుకురావడం ద్వారా అలా చేశాడు.
చాలా తెగుళ్ళు వచ్చిన తర్వాత ఫరో మోషేను పిలిపించి, ‘తెగుళ్ళను ఆపు. నేను ఇశ్రాయేలీయులను పోనిస్తాను’ అన్నాడు. కానీ తెగుళ్ళు ఆగిపోగానే ఫరో మళ్లీ తన మనస్సు మార్చుకున్నాడు. ఆయన ప్రజలను పోనివ్వలేదు. చివరకు యెహోవా 10వ తెగులును రప్పించినప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు.
ఆ పది తెగుళ్ళు ఏమిటో మీకు తెలుసా? మనం వాటి గురించి తెలుసుకుందాం.
నిర్గమకాండము 4:27-31; 5:1-23; 6:1-13, 26-30; 7:1-13.
ప్రశ్నలు
- మోషే అహరోనులు చేసిన అద్భుతాలు ఇశ్రాయేలీయులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?
- మోషే అహరోనులు ఫరోతో ఏమని చెప్పారు, ఫరో ఏమని సమాధానమిచ్చాడు?
- చిత్రంలో చూపించబడినట్లు, అహరోను తన కర్రను పడేసినప్పుడు ఏమి జరిగింది?
- యెహోవా ఫరోకు ఎలా పాఠం నేర్పించాడు, ఫరో ఎలా ప్రతిస్పందించాడు?
- పదవ తెగులు తర్వాత ఏమి జరిగింది?
అదనపు ప్రశ్నలు
- నిర్గమకాండము 4:27-31; 5:1-23 చదవండి.“నేను యెహోవాను ఎరుగను” అని ఫరో అన్నప్పుడు అతని మాటల భావమేమిటి? (నిర్గ. 5:2; 1 సమూ. 2:12; రోమా. 1:21)
- నిర్గమకాండము 6:1-13, 26-30 చదవండి.ఏ భావంలో యెహోవా అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు “తెలియబడలేదు?” (నిర్గ. 3:13, 14; 6:3; ఆది. 12:8)మోషే తనకు నియమించబడిన పనికి తాను అర్హుడను కాను అని భావించినా యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడని తెలుసుకోవడం మనకు ఎలాంటి ఓదార్పును ఇస్తుంది? (నిర్గ. 6:12, 30; లూకా 21:13-15)
- నిర్గమకాండము 7:1-13 చదవండి.మోషే అహరోనులు యెహోవా తీర్పుల గురించి ధైర్యంగా ఫరోకు చెప్పినప్పుడు, వాళ్ళు నేటి దేవుని సేవకుల కోసం ఎలాంటి ప్రమాణాన్ని ఏర్పరిచారు? (నిర్గ. 7:2, 3, 6; అపొ. 4:29-31)యెహోవా తాను ఐగుప్తు దేవుళ్ళకంటే శ్రేష్ఠమైనవాడనని ఎలా చూపించాడు? (నిర్గ. 7:12; 1 దిన. 29:12)
Post a Comment