యొర్దాను నది దాటడం
చూడండి! ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటుతున్నారు! మరి నదిలోని నీళ్ళు ఏవి? సంవత్సరంలోని ఆ సమయంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి అప్పటివరకూ నది పొంగి పొర్లింది. అయితే కొద్ది నిమిషాల్లోనే నీళ్ళు లేకుండా పోయాయి! ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచినట్లే ఎండిన నేలపై నడిచి వెళ్తున్నారు! నీళ్ళన్ని ఎక్కడికి పోయాయి? చూద్దాం.
ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటే సమయం వచ్చింది. అప్పుడు ‘యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొని ముందుగా నడవాలి. వాళ్ళు తమ పాదాలను యొర్దాను నది నీళ్ళలో పెట్టిన వెంటనే నీళ్ళ ప్రవాహం ఆగిపోతుంది’ అని ప్రజలకు చెప్పమని యెహోవా యెహోషువకు చెప్పాడు.
కాబట్టి యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజలకు ముందుగా నడిచారు. యొర్దాను దగ్గరకు వచ్చినప్పుడు యాజకులు నీటిలో అడుగు పెట్టారు. ఆ నది ఎంతో వేగంగా, లోతుగా ప్రవహిస్తుంది. అయితే వాళ్ళ పాదాలు నీళ్ళను తాకగానే నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది! అద్భుతం! ప్రవహిస్తున్న నీళ్ళను యెహోవా నిలిపివేశాడు. వెంటనే నదిలో నీళ్ళు ఇంకిపోయాయి!
నిబంధన మందసాన్ని మోసుకెళ్తున్న యాజకులు ఎండిన నది మధ్య భాగంలోకి వెళ్ళారు. వాళ్ళు చిత్రంలో మీకు కనిపిస్తున్నారా? వాళ్ళు అక్కడ నిలబడి ఉండగా ఇశ్రాయేలీయులంతా ఎండిన యొర్దాను నది నేలపై నడిచి వెళ్ళారు!
అందరూ దాటిపోయిన తర్వాత బలంగల 12 మంది వ్యక్తులకు యెహోవా యెహోషువతో ఇలా చెప్పించాడు: ‘యాజకులు నిబంధన మందసమును ఎత్తుకొని నిలబడిన చోటికి వెళ్ళి అక్కడనుండి 12 రాళ్ళను తీసుకొని వచ్చి ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో నిలబెట్టండి. భవిష్యత్తులో మీ కుమారులు ఈ రాళ్ళు ఏమిటని అడిగినప్పుడు, యెహోవా నిబంధన మందసము యొర్దానును దాటినప్పుడు నీళ్ళు నిలిచిపోయాయని మీరు చెప్పాలి. ఈ రాళ్ళు మీకు ఈ అద్భుతాన్ని గుర్తు చేస్తాయి!’ నది అడుగు భాగాన యాజకులు నిలబడిన చోట కూడా యెహోషువ 12 రాళ్ళను నిలబెట్టించాడు.
చివరకు యెహోషువ, ‘యొర్దానును దాటండి’ అని నిబంధన మందసమును మోస్తున్న యాజకులతో చెప్పాడు. వాళ్ళు అలా దాటిన వెంటనే నది మళ్ళీ ప్రవహించడం ప్రారంభించింది.
యెహోషువ 3:1-17; 4:1-18.
ప్రశ్నలు
- ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటడానికి వీలుగా యెహోవా ఏ అద్భుతం చేశాడు?
- యొర్దాను నది దాటాలంటే ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని చర్యల్లో ఎలా చూపించాల్సి వచ్చింది?
- నది మధ్యనుండి 12 పెద్ద రాళ్ళను తీసుకొమ్మని యెహోవా యెహోషువకు ఎందుకు చెప్పాడు?
- యాజకులు యొర్దాను నదినుండి బయటకు రాగానే ఏమి జరిగింది?
అదనపు ప్రశ్నలు
- యెహోషువ 3:1-17 చదవండి.ఈ వృత్తాంతం ద్వారా ఉదహరించబడినట్లు, మనకు యెహోవా సహాయం, ఆశీర్వాదం లభించాలంటే మనమేమి చేయాలి? (యెహో. 3:13, 15; సామె. 3:5; యాకో. 2:22, 26)ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి నది దాటవలసి వచ్చినప్పుడు యొర్దాను నది పరిస్థితి ఎలా ఉండింది, అది యెహోవా నామాన్ని ఎలా మహిమపరచింది? (యెహో. 3:15; 4:18; కీర్త. 66:5-7)
- యెహోషువ 4:1-18 చదవండి.యొర్దాను నదినుండి తీసుకోబడి గిల్గాలు వద్ద ఉంచబడిన 12 రాళ్ళు దేనికి గుర్తుగా ఉపయోగపడ్డాయి? (యెహో. 4:4-7, 19-24)
Post a Comment