పసివాడైన మోషే రక్షించబడడం
ఆ స్త్రీ వ్రేలిని పట్టుకొని ఏడుస్తున్న పసిబిడ్డను చూడండి. అతను మోషే. ఆ అందమైన యువతి ఎవరో తెలుసా? ఆమె ఐగుప్తు యువరాణి, ఫరో కుమార్తె.
మోషే తల్లి ఐగుప్తీయులు తన బిడ్డను చంపకుండా ఉండాలని అతనికి మూడు నెలలు వచ్చేవరకు దాచిపెట్టి ఉంచింది. కానీ మోషే ఎలాగైనా దొరికిపోతాడని ఆమెకు తెలుసు, అందుకే అతన్ని రక్షించడానికి ఆమె ఇలా చేసింది.
ఆమె ఒక బుట్టను తీసుకుని దానిలోకి నీళ్ళు ప్రవేశించకుండా చేసింది. తర్వాత అందులో మోషేను ఉంచి ఆ బుట్టను నైలు నది ఒడ్డున బాగా పెరిగివున్న ఎత్తైన జమ్ములో పెట్టింది. ఏమి జరుగుతుందో చూడమని చెప్పి మోషే అక్క మిర్యామును ఆ దగ్గర్లో నిలబెట్టింది.
ఇంతలో ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె, ఎత్తైన జమ్ములో ఉన్న బుట్టను చూసింది. ఆమె తన సేవకురాళ్ళలో ఒకరిని పిలిచి, ‘వెళ్ళి ఆ బుట్ట తీసుకురా’ అని చెప్పింది. యువరాణి ఆ బుట్ట తెరచి చూడగానే అందులో అందమైన పసిబిడ్డ కనిపించాడు! పసివాడైన మోషే ఏడ్వడాన్ని చూసి యువరాణి చాలా బాధపడింది. అతను చంపబడకుండా ఉండాలని ఆమె కోరుకుంది.
అప్పుడు మిర్యాము ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమెను మీరు చిత్రంలో చూడవచ్చు. మిర్యాము ఫరో కుమార్తెతో, ‘నేను వెళ్ళి నీ కోసం ఈ పిల్లవాడిని పెంచేందుకు ఒక ఇశ్రాయేలు స్త్రీని పిలుచుకొని రానా?’ అని అడిగింది.
యువరాణి ‘పిలుచుకురా’ అని చెప్పింది.
మిర్యాము వెంటనే తన తల్లికి చెప్పడానికి పరిగెత్తుకు వెళ్ళింది. మోషే తల్లి యువరాణి దగ్గరకు వచ్చినప్పుడు ‘ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి నా కోసం పెంచు, నేను నీకు జీతం ఇస్తాను’ అని యువరాణి చెప్పింది.
ఆ విధంగా మోషే తల్లే తన బిడ్డను పెంచింది. ఆ తర్వాత మోషే పెద్దవాడయ్యాక అతని తల్లి అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆమె అతన్ని తన కుమారునిగా స్వీకరించింది. ఆ విధంగా మోషే ఫరో గృహంలో పెరిగాడు.
నిర్గమకాండము 2:1-10.
ప్రశ్నలు
- చిత్రంలో కనిపిస్తున్న పసివాడు ఎవరు, అతను ఎవరి వ్రేలును పట్టుకొని ఉన్నాడు?
- మోషే చనిపోకుండా ఉండేందుకు అతని తల్లి ఏమి చేసింది?
- చిత్రంలోని అమ్మాయి ఎవరు, ఆమె ఏమి చేసింది?
- ఫరో కుమార్తెకు ఆ పసివాడు దొరికినప్పుడు, మిర్యాము ఏమని సలహా ఇచ్చింది?
- యువరాణి మోషే తల్లితో ఏమని చెప్పింది?
అదనపు ప్రశ్న
- నిర్గమకాండము 2:1-10 చదవండి.మోషే చిన్నతనంలో ఆయనకు శిక్షణనిచ్చి, బోధించడానికి వీలుగా మోషే తల్లికి ఎలాంటి అవకాశం లభించింది, నేటి తల్లిదండ్రులకు అది ఎలాంటి మాదిరిగా ఉంది? (నిర్గ. 2:9, 10; ద్వితీ. 6:6-9; సామె. 22:6; ఎఫె. 6:4; 2 తిమో. 3:15)
Post a Comment