అహరోను కర్రకు పువ్వులు పూయడం
ఆ కర్రకు వచ్చిన పువ్వులను బాదం పండ్లను చూడండి. అది అహరోను కర్ర. కేవలం ఒక్క రాత్రిలోనే అహరోను కర్రకు పువ్వులు పూసి, పండ్లు కాశాయి! ఎందుకో చూద్దాం.
అప్పటికి కొంతకాలంనుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది మోషే నాయకునిగా ఉండడాన్ని, అహరోను ప్రధాన యాజకునిగా ఉండడాన్ని ఇష్టపడలేదు. అలా ఇష్టపడనివాళ్ళలో కోరహు, దాతాను, అబీరాము, 250 మంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళంతా మోషే దగ్గరకు వచ్చి, ‘మా అందరిపై నిన్ను నువ్వు అధికారిగా ఎందుకు చేసుకున్నావు?’ అని అడిగారు.
మోషే కోరహుతో అతని అనుచరులతో, ‘రేపు ఉదయం మీరు ధూపార్తులను తీసుకొని, వాటిలో ధూపాన్ని వేసి, యెహోవా మందిరానికి రండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో చూద్దాం’అని చెప్పాడు.
మరుసటి రోజు కోరహు, అతని 250 మంది అనుచరులు మందిరం దగ్గరకు వచ్చారు. వాళ్ళను బలపరచడానికి వేరేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. యెహోవాకు చాలా కోపం వచ్చింది. ‘ఈ చెడ్డ మనుష్యుల గుడారాల దగ్గరనుండి దూరంగా వెళ్ళండి. వాళ్ళ వస్తువులలో దేనిని తాకవద్దు’అని మోషే చెప్పాడు. ఆ మాట విని ప్రజలు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గరనుండి దూరంగా వెళ్ళారు.
అప్పుడు మోషే, ‘దీన్నిబట్టి యెహోవా ఎవరిని ఎన్నుకున్నాడో మీరు తెలుసుకుంటారు. నేల నోరు తెరచి ఈ చెడ్డవాళ్ళందరిని మ్రింగివేస్తుంది’అన్నాడు.
మోషే మాట్లాడడం ముగించిన వెంటనే నేల తెరుచుకుంది. కోరహు గుడారం, అతని సంపద, దాతాను, అబీరాము, వాళ్ళతో ఉన్నవాళ్ళంతా నేలలోకి దిగిపోయారు. నేల మళ్ళీ మూసుకుంది. నేలలోకి దిగిపోతున్న వారి అరుపులు విని ప్రజలు ‘పరుగెత్తండి! భూమి మనలను కూడా మ్రింగివేస్తుందేమో!’ అని కేకలు వేశారు.
కోరహు, అతని 250 మంది అనుచరులు ఇంకా మందిరం దగ్గరే ఉన్నారు. కాబట్టి యెహోవా అగ్ని పంపగా వాళ్ళందరూ దహించబడ్డారు. అప్పుడు యెహోవా, చనిపోయినవాళ్ళ ధూపార్తులను తీసుకొని వాటితో బలిపీఠానికి ఒక పలుచని తొడుగును చేయించమని అహరోను కుమారుడైన ఎలియాజరుకు చెప్పాడు. ఆ బలిపీఠపు తొడుగు, అహరోను ఆయన కుమారులు తప్ప యెహోవాకు మరెవరూ యాజకత్వాన్ని చేయకూడదు అని చూపించేందుకు ఇశ్రాయేలీయులందరికి ఒక హెచ్చరికగా పనిచేసింది.
అయితే యెహోవా తాను అహరోనును, ఆయన కుమారులను మాత్రమే యాజకులనుగా ఎంపిక చేసుకొన్నానని స్పష్టం చేయాలనుకున్నాడు. అందుచేత ఆయన మోషేతో, ‘ఇశ్రాయేలులోని ప్రతి గోత్రానికి చెందిన ప్రధానులు ఒక కర్రను తీసుకు రావాలి. అహరోను లేవీ గోత్రం తరఫున తన కర్రను తీసుకు రావాలి. తర్వాత ఆ కర్రలన్నింటిని గుడారంలో నిబంధన మందసము ఎదుట పెట్టాలి. నేను ఎన్నుకున్న వ్యక్తి కర్రకు పువ్వులు పూస్తాయి’అని చెప్పాడు.
మరుసటి రోజు ఉదయం మోషే వెళ్ళి చూసేసరికి, అహరోను కర్రకు పువ్వులు పూసి, బాదం పండ్లు కాశాయి! యెహోవా అహరోను కర్రకు పువ్వులు పూసేలా ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమైందా?
సంఖ్యాకాండము 16:1-49; 17:1-11; 26:10.
ప్రశ్నలు
- మోషే అహరోనుల అధికారానికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేశారు, వాళ్ళు మోషేతో ఏమన్నారు?
- మోషే కోరహుకు, అతని 250 మంది అనుచరులకు ఏమి చెప్పాడు?
- మోషే ప్రజలకు ఏమి చెప్పాడు, ఆయన మాట్లాడడం ముగించగానే ఏమి జరిగింది?
- కోరహుకు, అతని 250 మంది అనుచరులకు ఏమి జరిగింది?
- అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినవారి ధూపార్తులతో ఏమి చేశాడు, అలా ఎందుకు చేశాడు?
- అహరోను కర్రకు పువ్వులు పూసేలా యెహోవా ఎందుకు చేశాడు? (చిత్రం చూడండి.)
అదనపు ప్రశ్నలు
- సంఖ్యాకాండము 16:1-49 చదవండి.కోరహు, అతని అనుచరులు ఏమి చేశారు, అది యెహోవాకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు చర్య ఎందుకయ్యింది? (సంఖ్యా. 16:9, 10, 18; లేవీ. 10:1, 2; సామె. 11:2)కోరహు, 250 మంది “సమాజప్రధానులు” ఎలాంటి తప్పుడు దృక్కోణాన్ని పెంపొందించుకున్నారు? (సంఖ్యా. 16:1-3; సామె. 15:33; యెష. 49:7)
- సంఖ్యాకాండము 17:1-77, 26:10 చదవండి.అహరోను కర్ర చిగురించడం దేనిని సూచించింది, దానిని మందసములో ఉంచమని యెహోవా ఎందుకు చెప్పాడు? (సంఖ్యా. 17:5, 8, 10)అహరోను కర్రకు సంబంధించిన అద్భుతంనుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 17:10; అపొ. 20:28; ఫిలి. 2:14; హెబ్రీ. 13:17)
Post a Comment