ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం
చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నోవహు కుమారులకు చాలామంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు వాళ్ళకు కూడా చాలామంది పిల్లలు పుట్టారు. కొద్దికాలానికే భూమ్మీద చాలామంది ప్రజలు తయారయ్యారు.
ఆ ప్రజలలో ఒకడు, నోవహు మునిమనవడైన నిమ్రోదు అనే పేరుగల వ్యక్తి. అతను జంతువులనూ అలాగే మనుష్యులనూ వేటాడే చెడ్డ వ్యక్తి. అంతేకాక ఇతరులపై పరిపాలన చేయడానికి అతను తనను తాను రాజుగా చేసుకున్నాడు. దేవుడు నిమ్రోదును ఇష్టపడలేదు.
ఆ కాలంలో ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారు. నిమ్రోదు ప్రజలపై పరిపాలన చేసేందుకు వీలుగా వాళ్ళందరినీ ఒక్క చోటే ఉంచాలని అనుకున్నాడు. అందుకు అతనేమి చేశాడో మీకు తెలుసా? ఒక పట్టణాన్ని కట్టి అందులో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించమని ప్రజలకు చెప్పాడు. వాళ్ళు ఇటుకలు తయారు చేయడాన్ని మీరు చిత్రంలో చూడవచ్చు.
యెహోవా దేవుడు ఆ నిర్మాణ పనిని ఇష్టపడలేదు. ప్రజలు చెదరిపోయి భూమ్మీద అన్ని ప్రాంతాలలో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ప్రజలు, ‘మనం భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణాన్ని, దానిలో ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి!’ అని అనుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి కాదుగాని, తమను తామే ఘనపరచుకోవాలని ఆశించారు.
కాబట్టి ప్రజలు ఆ గోపురం నిర్మించడాన్ని దేవుడు ఆపేశాడు. ఆయనెలా ఆపేశాడో తెలుసా? ఒకే భాషకు బదులు ప్రజలు అకస్మాత్తుగా, వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశాడు. గోపురాన్ని కట్టేవారు ఇక ఒకరినొకరు అర్థంచేసుకోలేక పోయారు. అందుకే వాళ్ళ పట్టణం బాబెలు లేక బబులోను అని పిలువబడింది, ఆ పేరుకు “తారుమారు” అని అర్థం.
అప్పుడు ప్రజలు బాబెలు నుండి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు గుంపులు గుంపులుగా భూమ్మీద ఇతర ప్రాంతాలలో జీవించడానికి బయలుదేరి వెళ్ళారు.
ఆదికాండము 10:1, 8-10; 11:1-9.
ప్రశ్నలు
- నిమ్రోదు ఎవరు, దేవుడు ఆయన గురించి ఎలా భావించాడు?
- చిత్రంలో కనిపిస్తున్నట్లు ప్రజలు ఇటుకలు ఎందుకు తయారు చేశారు?
- యెహోవా ఆ నిర్మాణ పనిని ఎందుకు ఇష్టపడలేదు?
- గోపుర నిర్మాణాన్ని దేవుడు ఎలా ఆపేశాడు?
- ఆ పట్టణం పేరేమిటి, ఆ పేరుకు అర్థమేమిటి?
- దేవుడు ప్రజల భాషలను తారుమారు చేసిన తర్వాత వాళ్ళు ఏమి చేశారు?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 10:1, 8-10 చదవండి.నిమ్రోదు ఎలాంటి స్వభావాన్ని ప్రదర్శించాడు, అది మనకు ఎలాంటి హెచ్చరికగా ఉంది? (సామె. 3:31)
- ఆదికాండము 11:1-9 చదవండి.గోపురాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటి, ఆ నిర్మాణ పని ఎందుకు విఫలమయ్యింది? (ఆది. 11:4; సామె. 16:18; యోహా. 5:44)
Post a Comment