యెహోషువ నాయకుడు కావడం
ఇశ్రాయేలీయులతోపాటు కనానుకు వెళ్ళాలని మోషే కోరుకున్నాడు. ‘యెహోవా, నన్ను యొర్దాను నదిని దాటనివ్వు. ఆ మంచి దేశాన్ని చూడనివ్వు’ అని ఆయన అడిగాడు. అయితే యెహోవా, ‘ఇక చాలు! ఆ సంగతి గురించి మళ్ళీ మాట్లాడవద్దు!’ అని అన్నాడు. యెహోవా ఎందుకలా అన్నాడో తెలుసా?
దానికి కారణం మోషే బండను కొట్టినప్పుడు జరిగిన సంగతే. ఆయన, అహరోను యెహోవాను ఘనపరచలేదు అని గుర్తు చేసుకోండి. యెహోవాయే ఆ బండనుండి నీళ్ళు రప్పించాడని వాళ్ళు చెప్పలేదు. అందుకే వాళ్ళు కనానులోకి ప్రవేశించరని యెహోవా చెప్పాడు.
అహరోను చనిపోయిన కొన్ని నెలల తర్వాత యెహోవా మోషేతో, ‘నువ్వు యెహోషువను తీసుకువెళ్ళి యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రజల ఎదుట నిలబెట్టు. అక్కడ అందరి ముందు యెహోషువ క్రొత్త నాయకుడని చెప్పు’ అన్నాడు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్లు మోషే యెహోవా చెప్పినట్లే చేశాడు.
అప్పుడు యెహోవా యెహోషువతో, ‘ధైర్యంగా ఉండు, భయపడవద్దు. నేను వాగ్దానం చేసిన కనానులోకి నువ్వు ఇశ్రాయేలీయులను నడిపిస్తావు. నేను నీకు తోడుగా ఉంటాను’ అని చెప్పాడు.
తర్వాత యెహోవా మోషేను మోయాబు దేశములోని నెబో కొండపైకి ఎక్కమన్నాడు. అక్కడనుండి మోషే యొర్దాను నదికి అవతలి వైపున్న అందమైన కనాను దేశాన్ని చూడగలిగాడు. యెహోవా ఆయనతో, ‘నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశము ఇదే. నిన్ను దానిని చూడనిచ్చాను గాని, దానిలోకి ప్రవేశించనివ్వను’ అన్నాడు.
మోషే అక్కడే నెబో కొండపైన మరణించాడు. అప్పుడు ఆయన వయస్సు 120 సంవత్సరాలు. ఆయన అప్పటికి బలంగానే ఉండేవాడు. ఆయన చూపు మందగించలేదు. మోషే మరణించినందుకు ప్రజలు ఎంతో దుఃఖపడి ఏడ్చారు. అయితే వాళ్ళు తమ క్రొత్త నాయకునిగా యెహోషువ ఉన్నందుకు సంతోషించారు.
సంఖ్యాకాండము 27:12-23; ద్వితీయోపదేశకాండము 3:23-29; 31:1-8, 14-23; 32:45-52; 34:1-12.
ప్రశ్నలు
- చిత్రంలో మోషేతోపాటు నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరు?
- యెహోవా యెహోషువకు ఏమి చెప్పాడు?
- మోషే నెబో కొండపైకి ఎందుకు వెళ్ళాడు, యెహోవా ఆయనకు ఏమి చెప్పాడు?
- మోషే చనిపోయేటప్పటికి ఆయన వయసెంత?
- ప్రజలు ఎందుకు దుఃఖించారు, అయితే వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏ కారణముంది?
అదనపు ప్రశ్నలు
- సంఖ్యాకాండము 27:12-23 చదవండి.యెహోషువకు యెహోవానుండి ఏ బరువైన బాధ్యత లభించింది, యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న శ్రద్ధ నేడు ఎలా స్పష్టమవుతోంది? (సంఖ్యా. 27:15-19; అపొ. 20:28; హెబ్రీ. 13:7)
- ద్వితీయోపదేశకాండము 3:23-29 చదవండి.మోషే అహరోనులు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి యెహోవా ఎందుకు అనుమతించలేదు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ద్వితీ. 3:25-27; సంఖ్యా. 20:12, 13)
- ద్వితీయోపదేశకాండము 31:1-8, 14-23 చదవండి.విడిపోయేముందు మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు, ఆయన యెహోవానుండి లభించిన క్రమశిక్షణను వినయంతో స్వీకరించాడని ఎలా చూపిస్తున్నాయి? (ద్వితీ. 31:6-8, 23)
- ద్వితీయోపదేశకాండము 32:45-52 చదవండి.దేవుని వాక్యం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి? (ద్వితీ. 32:47; లేవీ. 18:5; హెబ్రీ. 4:12)
- ద్వితీయోపదేశకాండము 34:1-12 చదవండి.మోషే అక్షరార్థంగా యెహోవాను ఎన్నడూ చూడకపోయినా, యెహోవాతో ఆయనకున్న సంబంధం గురించి ద్వితీయోపదేశకాండము 34:10 ఏమి సూచిస్తోంది? (నిర్గ. 33:11, 20; సంఖ్యా. 12:8)
Post a Comment