కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళడం
యోసేపు తన భావాలను అణచుకోలేకపోయాడు. ఆయన తన సేవకులనందరిని గదిలో నుండి బయటకు వెళ్ళమన్నాడు. యోసేపు తన సహోదరులతో ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్వడం ప్రారంభించాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఆయన సహోదరులు ఎంత ఆశ్చర్యపడి ఉంటారో మనం ఊహించవచ్చు. చివరకు ఆయన ‘నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?’ అని అడిగాడు.
ఆయన సహోదరులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. వాళ్ళకు భయమేసింది. అయితే యోసేపు, ‘దగ్గరకు రండి,’ అనగానే వాళ్ళు దగ్గరకు వెళ్ళారు. అప్పుడాయన ‘మీరు ఐగుప్తులోకి అమ్మేసిన మీ సహోదరుడైన యోసేపును నేను’ అని చెప్పాడు.
యోసేపు ఎంతో దయతో మాట్లాడుతూ, ‘మీరు నన్ను అమ్మేసినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రజల జీవితాలను కాపాడేందుకు దేవుడే నన్ను ఐగుప్తుకు పంపాడు. ఫరో నన్ను ఈ దేశానికంతటికీ పరిపాలకునిగా నియమించాడు. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి నా తండ్రికి ఈ సంగతి చెప్పండి. ఆయనను ఇక్కడకు వచ్చి ఇక్కడే నివసించమని చెప్పండి’ అని వాళ్ళతో అన్నాడు.
ఆ తర్వాత యోసేపు తన సహోదరులను దగ్గరకు తీసుకొని వాళ్ళను హత్తుకొని ముద్దుపెట్టుకున్నాడు. యోసేపు సహోదరులు వచ్చారని ఫరోకు తెలిసినప్పుడు ఆయన యోసేపుతో, ‘వాళ్ళు బండ్లను తీసుకువెళ్ళి తమ తండ్రిని, కుటుంబాలను ఐగుప్తుకు తీసుకురానివ్వు. నేను వాళ్ళకు ఐగుప్తులో మంచి ప్రదేశాన్ని ఇస్తాను’ అని చెప్పాడు.
వాళ్ళు అలాగే చేశారు. యాకోబు తన కుటుంబమంతటితో ఐగుప్తుకు రాగానే యోసేపు ఆయనను కలుసుకోవడం మీరు ఇక్కడ చూడవచ్చు.
యాకోబు కుటుంబం చాలా పెద్దదయ్యింది. వాళ్ళు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు యాకోబు, ఆయన పిల్లలు, ఆయన మనవళ్ళతో సహా మొత్తం 70 మంది ఉన్నారు. అంతేగాక వాళ్ళ భార్యలు, బహుశా చాలామంది సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఐగుప్తులో నివసించడం ప్రారంభించారు. వాళ్ళు ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు, ఎందుకంటే దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేక జనాంగంగా చేసుకున్నాడు, దాని గురించి మనం తర్వాత తెలుసుకుంటాం.
ఆదికాండము 45:1-28; 46:1-27.
ప్రశ్నలు
- యోసేపు తానెవరో తన సహోదరులకు చెప్పినప్పుడు ఏమి జరిగింది?
- యోసేపు తన సహోదరులకు దయతో ఏమి వివరించాడు?
- యోసేపు సహోదరుల గురించి ఫరోకు తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడు?
- యాకోబు కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళినప్పుడు ఎంత పెద్దగా ఉంది?
- యాకోబు కుటుంబం ఏమని పిలువబడింది, ఎందుకు అలా పిలువబడింది?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 45:1-28 చదవండి.తన సేవకులకు హాని చేయడానికి ఉద్దేశించబడిన పనులను యెహోవా సత్ఫలితాలుగా మార్చగలడని యోసేపు గురించిన బైబిలు వృత్తాంతం ఎలా చూపిస్తోంది? (ఆది. 45:5-8; యెష. 8:10; ఫిలి. 1:12-14)
- ఆదికాండము 46:1-27 చదవండి.యాకోబు ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చాడు? (ఆది. 46:1-4)
Post a Comment