యోసేపు చెరసాలలో వేయబడడం
యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్ళబడినప్పుడు ఆయనకు 17 సంవత్సరాలే. వాళ్ళు అక్కడ ఆయనను పోతీఫరు అనే వ్యక్తికి అమ్మేశారు. పోతీఫరు ఫరో అని పిలువబడే ఐగుప్తు రాజు దగ్గర ఉద్యోగం చేసేవాడు.
యోసేపు తన యజమానుడైన పోతీఫరు కోసం కష్టపడి పని చేసేవాడు. కాబట్టి యోసేపు పెద్దవాడైనప్పుడు, పోతీఫరు ఆయనను తన ఇల్లంతటిపైన అధికారిగా నియమించాడు. అయితే యోసేపు చెరసాలలో ఎందుకు ఉన్నాడు? దానికి కారణం పోతీఫరు భార్య.
యోసేపు పెద్దవాడై ఎంతో అందమైన యువకుడిగా తయారైనప్పుడు, పోతీఫరు భార్య ఆయనను తనతో శయనించమని కోరింది. అయితే అది తప్పని యోసేపుకు తెలుసు కాబట్టి ఆయన దానికి అంగీకరించలేదు. పోతీఫరు భార్యకు చాలా కోపం వచ్చింది. కాబట్టి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆయనతో అబద్ధమాడుతూ, ‘ఆ చెడ్డ యోసేపు నాతో శయనించడానికి ప్రయత్నించాడు’ అని చెప్పింది. పోతీఫరు తన భార్య మాటలు నమ్మి యోసేపుమీద కోపం తెచ్చుకున్నాడు. అందుకని ఆయనను చెరసాలలో వేయించాడు.
చెరసాల ముఖ్యాధికారి యోసేపు మంచివాడని త్వరలోనే గ్రహించాడు. కాబట్టి ఆయన చెరసాలలోని ఇతర ఖైదీలందరిపై యోసేపును అధికారిగా నియమించాడు. ఆ తర్వాత ఫరో తన పానదాయకునిపై వంటవాడిపై కోపపడి వాళ్ళను కూడా చెరసాలలో వేయించాడు. ఒకరాత్రి వాళ్ళిద్దరికి ఒక్కో ప్రత్యేకమైన కల వచ్చింది గాని వాళ్ళకు తమ కలల అర్థం తెలియలేదు. ఆ మరుసటి రోజు యోసేపు వాళ్ళతో, ‘మీ కలల గురించి నాకు చెప్పండి’ అని వాళ్ళను అడిగాడు. వాళ్ళు తమ కలల గురించి చెప్పినప్పుడు యోసేపు దేవుని సహాయంతో వారి కలల భావాన్ని వివరించాడు.
పానదాయకునితో యోసేపు, ‘మరో మూడు రోజుల్లో నువ్వు చెరసాలనుండి విడిపించబడతావు. నువ్వు మళ్ళీ ఫరో పానదాయకుడవు అవుతావు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా గురించి ఫరోకు చెప్పి నన్ను ఈ స్థలమునుండి విడిపించు’ అన్నాడు. అయితే వంటవాడితో యోసేపు ‘ఇక మూడు రోజుల్లో ఫరో నీ తలను కొట్టివేయిస్తాడు’ అని చెప్పాడు.
మూడు రోజుల్లో యోసేపు చెప్పినట్లే జరిగింది. ఫరో వంటవాడి తలను కొట్టివేయించాడు. పానదాయకుడు విడిపించబడి మళ్ళీ రాజు సేవలోకి తీసుకోబడ్డాడు. అయితే పానదాయకుడు యోసేపు సంగతంతా మరచిపోయాడు! ఆయన గురించి ఫరోకు ఏమీ చెప్పలేదు. యోసేపు అలాగే చెరసాలలో ఉండవలసి వచ్చింది.
ఆదికాండము 39:1-23; 40:1-23.
ప్రశ్నలు
- యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్ళబడినప్పుడు ఆయన వయసెంత, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది?
- యోసేపు చెరసాలలో ఎందుకు వేయబడ్డాడు?
- యోసేపుకు చెరసాలలో ఏ బాధ్యత ఇవ్వబడింది?
- చెరసాలలో యోసేపు ఫరో పానదాయకునికి, వంటవాడికి ఎలాంటి సహాయం చేశాడు?
- పానదాయకుడు చెరసాల నుండి విడుదల చేయబడిన తర్వాత ఏమి జరిగింది?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 39:1-23 చదవండి.యోసేపు కాలంలో వ్యభిచారాన్ని ఖండిస్తూ దేవుడు వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞ లేదు కదా, మరి పోతీఫరు భార్యనుండి పారిపోవడానికి యోసేపును ప్రేరేపించినదేమిటి? (ఆది. 2:24; 20:3; 39:9)
- ఆదికాండము 40:1-23 చదవండి.పానదాయకుడికి వచ్చిన కలను, యోసేపుకు యెహోవా తెలియజేసిన భావాన్ని క్లుప్తంగా చెప్పండి. (ఆది. 40:9-13)వంటవాడికి వచ్చిన కల ఏమిటి, దాని భావమేమిటి? (ఆది. 40:16-19)నేడు నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుని తరగతి యోసేపు వైఖరిని ఎలా అనుకరించింది? (ఆది. 40:8; కీర్త. 36:9; యోహా. 17:17; అపొ. 17:2, 3)క్రైస్తవులు జన్మదిన వేడుకలను ఎలా దృష్టిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండము 40:20 ఎలా సహాయం చేస్తుంది? (ప్రసం. 7:1; మార్కు 6:21-28)
Post a Comment