ఇశ్రాయేలులో దొంగ
ఈ వ్యక్తి తన గుడారంలో ఏమి పాతిపెడుతున్నాడో చూడండి! ఒక చక్కని వస్త్రము, బంగారు కమ్మి, కొన్ని వెండి ముక్కలు దాచిపెడుతున్నాడు. అతను వాటిని యెరికోనుండి తీసుకున్నాడు. నిజానికి యెరికోలోని వస్తువులను ఏమి చెయ్యాలి? మీకు జ్ఞాపకం ఉందా?
వాటిని నాశనం చెయ్యాలి. బంగారము, వెండిని మాత్రం యెహోవా గుడారపు ధనాగారానికి ఇవ్వాలి. కానీ ఈ వ్యక్తులు యెహోవాకు అవిధేయత చూపించారు. వాళ్ళు దేవుని సొత్తును దొంగిలించారు. ఆ వ్యక్తి పేరు ఆకాను. అతనితోపాటు ఉన్నవారు అతని కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏమి జరిగిందో చూద్దాం.
ఆకాను వాటిని దొంగిలించిన తర్వాత, యెహోషువ కొంతమందిని హాయి పట్టణముతో యుద్ధం చేయడానికి పంపించాడు. కానీ వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. కొందరు చంపబడ్డారు, మిగిలినవారు పారిపోయి వచ్చేశారు. యెహోషువ చాలా బాధపడ్డాడు. ఆయన తన ముఖాన్ని నేలకు వంచి, ‘ఎందుకు ఇలా జరగనిచ్చావు?’ అని యెహోవాకు ప్రార్థించాడు.
అందుకు యెహోవా, ‘ఇశ్రాయేలీయులు నా ఎదుట పాపము చేశారు. నాశనం చేయవలసిన వాటిని, యెహోవా గుడారానికి ఇవ్వవలసిన వాటిని వాళ్ళు ఉంచుకున్నారు. ఒక చక్కని వస్త్రాన్ని దొంగిలించి దాన్ని రహస్యంగా దాచిపెట్టారు. నువ్వు వాటిని, వాటిని తీసుకున్న వ్యక్తిని నాశనం చేసేంతవరకు నేను మిమ్మల్ని ఆశీర్వదించను’ అని సమాధానమిచ్చాడు. ఆ చెడ్డ వ్యక్తి ఎవరో నేను చూపిస్తానని కూడా యెహోవా యెహోషువతో చెప్పాడు.
కాబట్టి యెహోషువ ప్రజలందరిని సమకూర్చినప్పుడు యెహోవా చెడ్డవాడైన ఆకానును వేరుచేశాడు. అప్పుడు ఆకాను, ‘నేను పాపము చేశాను. ఒక చక్కని వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండి ముక్కలను నేను చూశాను. అవి నాకు ఎంతో నచ్చాయి కాబట్టి వాటిని తీసుకున్నాను. నేను వాటిని నా గుడారం లోపల పాతిపెట్టాను’ అని చెప్పాడు.
ఆ వస్తువులు యెహోషువ దగ్గరకు తీసుకురాబడినప్పుడు ఆయన ఆకానుతో, ‘నువ్వు మమ్మల్ని ఎందుకు కష్టపెట్టావు? ఇప్పుడు యెహోవా నిన్ను కష్టపెడతాడు!’ అన్నాడు. అప్పుడు ప్రజలంతా ఆకానును, అతని కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపారు. మనవి కాని వస్తువులను మనం ఎన్నడూ తీసుకోకూడదని ఇది చూపడం లేదా?
తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ హాయితో యుద్ధం చేశారు. ఈసారి యెహోవా తన ప్రజలకు సహాయం చెశాడు, వాళ్ళు యుద్ధంలో జయించారు.
యెహోషువ 7:1-26; 8:1-29.
ప్రశ్నలు
- చిత్రంలో యెరికోనుండి తీసుకోబడిన విలువైన వస్తువులను పాతి పెడుతున్న వ్యక్తి ఎవరు, ఆయనకు సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు?
- ఆకాను, అతని కుటుంబం చేసిన ఆ పని ఎందుకు అంత గంభీరమైనది?
- హాయివద్ద జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికిగల కారణమేమిటని యెహోషువ అడిగినప్పుడు యెహోవా ఏమి చెప్పాడు?
- ఆకాను, అతని కుటుంబం యెహోషువ దగ్గరకు తీసుకురాబడినప్పుడు, వాళ్ళకేమి జరిగింది?
- ఆకానుకు ఇవ్వబడిన తీర్పు మనకు ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తోంది?
అదనపు ప్రశ్నలు
- యెహోషువ 7:1-26 చదవండి.యెహోషువ ప్రార్థనలు, ఆయనకు యెహోవాతో ఉన్న సంబంధం గురించి ఏమి వెల్లడి చేశాయి? (యెహో. 7:7-9; కీర్త. 119:145; 1 యోహా. 5:14)ఆకాను ఉదాహరణ ఏమి చూపిస్తోంది, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (యెహో. 7:11, 14, 15; సామె. 15:3; 1 తిమో. 5:24; హెబ్రీ. 4:13)
- యెహోషువ 8:1-29 చదవండి.నేడు క్రైస్తవ సంఘంపట్ల మనకు ఎలాంటి వ్యక్తిగతమైన బాధ్యత ఉంది? (యెహో. 7:13; లేవీ. 5:1; సామె. 28:13)
Post a Comment