యోసేపు తన సహోదరులను పరీక్షించడం
యోసేపు తన 10 మంది అన్నలు ఇంకా చెడ్డవారిగా, దయలేనివారిగా ఉన్నారేమో చూడాలనుకున్నాడు. అందుకే ఆయన వాళ్ళతో, ‘మీరు వేగులవారు. మా దేశం ఏ విషయంలో బలహీనంగా ఉందో కనుక్కోవడానికే వచ్చారు’అని అన్నాడు.
అందుకు వాళ్ళు ‘కాదు, మేము వేగులవాళ్ళం కాదు. మేము మంచివాళ్ళమే. మేమందరం సహోదరులం. మేము 12 మందిమి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకడు లేడు, అందరికంటె చిన్నవాడు మా తండ్రితోపాటు ఇంటి దగ్గర ఉన్నాడు’అని చెప్పారు.
యోసేపు వాళ్ళను నమ్మనట్లు నటించాడు. ఆయన షిమ్యోను అనే సహోదరుణ్ణి చెరసాలలో వేసి, మిగతా వాళ్ళు ఆహారం తీసుకొని ఇంటికి వెళ్ళేందుకు అనుమతించాడు. అయితే ఆయన వాళ్ళతో ‘మీరు తిరిగివచ్చేటప్పుడు మీతోపాటు మీ చిన్న తమ్ముణ్ణి తీసుకొని రండి’అని చెప్పాడు.
వాళ్ళు కనానుకు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంగతంతా తండ్రియైన యాకోబుకు వివరించారు. యాకోబు ఎంతో దుఃఖించాడు. ‘యోసేపు లేడు, ఇప్పుడు షిమ్యోను కూడా లేడు. నా చిన్న కుమారుడైన బెన్యామీనును మీతో తీసుకువెళ్ళడానికి నేను అంగీకరించను’అని ఏడ్చాడు. కానీ వాళ్ళ ఆహారం అయిపోవడం ప్రారంభించినప్పుడు మళ్ళీ ఆహారం తెచ్చుకునేందుకు యాకోబు బెన్యామీనును పంపించవలసి వచ్చింది.
యోసేపు తన సహోదరులు రావడాన్ని చూశాడు. ఆయన తన తమ్ముడు బెన్యామీనును చూసి ఎంతో సంతోషించాడు. కానీ వాళ్ళలో ఎవ్వరికీ ఆ ప్రముఖుడు యోసేపేనని తెలియదు. అప్పుడు యోసేపు తన 10 మంది సహోదరులను పరీక్షించడానికి ఒక పని చేశాడు.
ఆయన తన దాసులచేత వారి సంచులన్నింటి నిండా ఆహారం నింపించాడు. కానీ వాళ్ళకు తెలియకుండా, తన ప్రత్యేకమైన వెండిగిన్నెను బెన్యామీను సంచిలో పెట్టించాడు. వాళ్ళంతా తమ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, యోసేపు వాళ్ళ వెనుక తన సేవకులను పంపించాడు. సేవకులు వాళ్ళను పట్టుకొని ‘మా ప్రభువు వెండిగిన్నెను మీరెందుకు దొంగిలించారు?’ అని అడిగారు.
‘మేము ఆయన గిన్నెను దొంగిలించలేదు’అని సహోదరులంతా సమాధానమిచ్చారు. ‘మాలో ఎవరి దగ్గరైనా ఆ గిన్నె కనబడితే వాడు చచ్చును గాక’అన్నారు.
సేవకులు వాళ్ళ సంచులన్ని వెదికారు, ఈ చిత్రంలో మీరు చూస్తున్నట్లు ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. సేవకులు వాళ్ళతో ‘మిగిలిన వాళ్ళందరూ వెళ్ళవచ్చు. బెన్యామీను మాత్రం మాతో రావాలి’ అని అన్నారు. ఆ పదిమంది సహోదరులు అప్పుడేమి చేశారు?
వాళ్ళందరూ బెన్యామీనుతోపాటు యోసేపు ఇంటికి తిరిగి వెళ్ళారు. యోసేపు తన సహోదరులతో ‘మీరందరు ఇంటికి వెళ్ళవచ్చు. బెన్యామీను మాత్రం ఇక్కడ నాకు దాసుడుగా ఉంటాడు’ అని చెప్పాడు.
అప్పుడు యూదా లేచి, ‘నేను ఈ చిన్నవాడు లేకుండా ఇంటికి తిరిగి వెళితే మా తండ్రి మరణిస్తాడు, ఎందుకంటే ఆయన ఇతనిని ఎంతో ప్రేమిస్తాడు. కాబట్టి దయచేసి, నన్ను దాసునిగా ఉంచుకొని ఈ చిన్నవాడిని పోనివ్వు’అని అడిగాడు.
అప్పుడు యోసేపుకు తన సహోదరులు మారినట్లు అర్థమైంది. వాళ్ళు చెడ్డవారిగా, దయలేనివారిగా లేరని తెలిసింది. ఆ తర్వాత యోసేపు ఏమి చేశాడో చూద్దాం.
ఆదికాండము 42:9-38; 43:1-34; 44:1-34.
ప్రశ్నలు
- యోసేపు తన సహోదరులు వేగులవారు అని ఎందుకు అన్నాడు?
- యాకోబు తన చిన్న కుమారుడైన బెన్యామీనును ఐగుప్తుకు ఎందుకు వెళ్ళనిచ్చాడు?
- యోసేపు వెండి గిన్నె బెన్యామీను సంచిలోకి ఎలా వచ్చింది?
- బెన్యామీనును విడిపించుకోవడానికి యూదా ఏమి చేస్తానని ముందుకు వచ్చాడు?
- యోసేపు సహోదరుల్లో ఎలాంటి మార్పు వచ్చింది?
అదనపు ప్రశ్నలు
- ఆదికాండము 42:9-38 చదవండి.ఆదికాండము 42:18లో యోసేపు అన్న మాటలు, నేడు యెహోవా సంస్థలో బాధ్యతగలవారికి ఎలా ఒక చక్కని జ్ఞాపికగా ఉన్నాయి? (నెహె. 5:15; 2 కొరిం. 7:1, 2)
- ఆదికాండము 43:1-34 చదవండి.రూబేను మొదటి కుమారుడు అయినప్పటికీ, యూదాయే తన సహోదరుల తరఫున మాట్లాడే వ్యక్తిగా వ్యవహరించాడని ఎలా స్పష్టమవుతోంది? (ఆది. 43:3, 8, 9; 44:14, 18; 1 దిన. 5:2)యోసేపు తన సహోదరులను ఎలా పరీక్షించాడు, ఆయనలా ఎందుకు చేశాడు? (ఆది. 43:33, 34)
- ఆదికాండము 44:1-34 చదవండి.తన సహోదరులు తనను గుర్తుపట్టకుండా ఉండడానికి యోసేపు వేసిన పథకంలో భాగంగా ఆయన తనను తాను ఎలాంటి పనులు చేసే వ్యక్తిగా చిత్రీకరించుకున్నాడు? (ఆది. 44:5, 15; లేవీ. 19:26)యోసేపు సహోదరులు తమకు తమ సహోదరునిపట్ల ముందు ఉండిన అసూయ ఇప్పుడు లేదని ఎలా చూపించారు? (ఆది. 44:13, 33, 34)
Post a Comment