గొప్ప బలంగల వ్యక్తి
జీవించినవారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన సమ్సోను అనే పేరుగల న్యాయాధిపతి. సమ్సోనుకు యెహోవాయే అంత బలమిచ్చాడు. సమ్సోను పుట్టక ముందే యెహోవా ఆయన తల్లితో, ‘త్వరలో నీకు ఒక కుమారుడు పుడతాడు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులనుండి కాపాడడంలో అతను నాయకత్వం వహిస్తాడు’ అని చెప్పాడు.
ఫిలిష్తీయులు కనానులో జీవించిన చెడ్డ ప్రజలు. వాళ్ళకు యుద్ధ యోధులు చాలామంది ఉండేవారు. వాళ్ళు ఇశ్రాయేలీయులను ఎంతో బాధపెట్టేవారు. ఒకసారి సమ్సోను ఫిలిష్తీయులు నివసించే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, దారిలో ఒక పెద్ద సింహం గర్జించుకుంటూ ఆయనపైకి వచ్చింది. అయితే సమ్సోను వట్టి చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు. ఆయన వందలాదిమంది చెడ్డ ఫిలిష్తీయులను కూడా చంపాడు.
తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయుల నాయకులు, సమ్సోను బలానికి రహస్యమేమిటో కనుక్కొని చెబితే ఒకొక్కరూ 1,100 వెండి నాణెముల చొప్పున ఇస్తామని దెలీలాకు వాగ్దానం చేశారు. దెలీలా ఆ డబ్బంతా కావాలని ఆశపడింది. ఆమె సమ్సోనుకు గాని, దేవుని ప్రజలకు గాని నిజమైన స్నేహితురాలు కాదు. కాబట్టి ఆమె సమ్సోను బలానికి రహస్యమేమిటో చెప్పమని పదే పదే ఆయనను అడిగేది.
చివరకు సమ్సోను తన బలానికి రహస్యమేమిటో దెలీలాకు చెప్పాడు. ‘నా వెంట్రుకలు ఎన్నడూ కత్తిరించబడలేదు, నేను పుట్టినప్పుడే, దేవుడు నన్ను నాజీరు చేయబడినవాడిగా అంటే ఒక ప్రత్యేకమైన సేవకునిగా ఏర్పరచుకున్నాడు. నా వెంట్రుకలను కత్తిరిస్తే నేను నా బలాన్ని కోల్పోతాను’ అని చెప్పాడు.
దెలీలా ఈ సంగతి తెలుసుకోగానే సమ్సోనును తన వడిలో నిద్రపుచ్చి ఆయన వెంట్రుకలను కత్తిరించేందుకు ఒక మనిషిని పిలిపించింది. సమ్సోను నిద్ర లేచేసరికి తన బలాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆయనను బంధించారు. వాళ్ళు ఆయన రెండు కండ్లను పెరికివేసి ఆయనను తమ దాసునిగా చేసుకున్నారు.
ఒకరోజు ఫిలిష్తీయులు తమ దేవుడైన దాగోనును ఆరాధించడానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళు సమ్సోనును ఎగతాళి చేయడానికి ఆయనను బందీగృహం నుండి బయటకు తీసుకొచ్చారు. ఈలోగా సమ్సోను వెంట్రుకలు మళ్ళీ పెరిగాయి. సమ్సోను తనను నడిపించుకొని వెళ్తున్న అబ్బాయితో, ‘ఈ భవనపు స్తంభాలను నన్ను పట్టుకోనివ్వు’ అన్నాడు. ఆ తర్వాత సమ్సోను బలం కోసం యెహోవాకు ప్రార్థించి స్తంభాలను పట్టుకున్నాడు. ‘నన్ను ఫిలిష్తీయులతోపాటు చనిపోనివ్వు’ అని ఆయన మొరపెట్టాడు. ఆ విందుకు 3,000 మంది ఫిలిష్తీయులు వచ్చారు. సమ్సోను ఆ స్తంభాలను పట్టుకొని వంగిన వెంటనే ఆ భవనం కూలిపోయి ఆ చెడ్డ ప్రజలందరూ చనిపోయారు.
న్యాయాధిపతులు 13 నుండి 16 అధ్యాయాలు.
ప్రశ్నలు
- జీవించినవారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి పేరేమిటి, ఆయనకు అంత బలాన్ని ఎవరు ఇచ్చారు?
- చిత్రంలో కనిపిస్తున్నట్లు ఒకసారి సమ్సోను ఒక పెద్ద సింహాన్ని ఏమి చేశాడు?
- చిత్రంలో సమ్సోను దెలీలాకు ఏ రహస్యం చెబుతున్నాడు, ఆయన ఫిలిష్తీయుల చేత బంధించబడడానికి అది ఎలా కారణమయ్యింది?
- సమ్సోను చనిపోయిన రోజున శత్రువులైన 3,000 మంది ఫిలిష్తీయులను ఎలా హతమార్చాడు?
అదనపు ప్రశ్నలు
- న్యాయాధిపతులు 13:1-14 చదవండి.మనోహ మరియు ఆయన భార్య, పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఎలా ఒక మంచి మాదిరిని ఉంచారు? (న్యాయా. 13:8; కీర్త. 127:3; ఎఫె. 6:4)
- న్యాయాధిపతులు 14:5-9, 15:9-16 చదవండి.సమ్సోను సింహాన్ని చంపడం, అతనికి కట్టబడిన కొత్త తాళ్ళను తెంచేయడం, 1,000 మందిని చంపడానికి మగ గాడిద దవడ ఎముకను ఉపయోగించడం వంటి వృత్తాంతాలు యెహోవా పరిశుద్ధాత్మ పని చేయడానికి సంబంధించి ఏమి వెల్లడి చేస్తున్నాయి?నేడు పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది? (న్యాయా. 14:6; 15:14; జెక. 4:6; అపొ. 4:31)
- న్యాయాధిపతులు 16:18-31 చదవండి.చెడు సహవాసాలు సమ్సోనుపై ఎలాంటి ప్రభావం చూపించాయి, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 16:18, 19; 1 కొరిం. 15:33)
Post a Comment