పది తెగుళ్ళు
ఇక్కడున్న చిత్రాలను చూడండి. వాటిలో ప్రతీది యెహోవా ఐగుప్తుపైకి రప్పించిన ఒక్కొక్క తెగులును చూపిస్తోంది. మొదటి చిత్రంలో అహరోను తన కర్రతో నైలునదిని కొట్టడాన్ని చూడవచ్చు. ఆయన అలా కొట్టగానే నీరు రక్తంగా మారింది. చేపలు చనిపోవడంతో నది కంపు కొట్టింది.
తర్వాత, యెహోవా నైలు నది నుండి కప్పలు పైకి వచ్చేలా చేశాడు. ఎక్కడ చూసినా అవే—పొయ్యిల దగ్గర, రొట్టెలు కాల్చుకునే పెంకలమీద, పడకలమీద—ఎక్కడ చూసినా అవే. కప్పలు చచ్చిపోయినప్పుడు ఐగుప్తీయులు వాటిని కుప్పలు కుప్పలుగా పోగు చేశారు. దేశమంతా దుర్వాసనతో నిండిపోయింది.
ఆ తర్వాత అహరోను తన కర్రతో నేలను కొట్టాడు. ధూళంతా పేలుగా మారింది. అవి గాలిలో ఎగురుతూ కుట్టే చిన్న పేలు. ఆ పేలు ఐగుప్తు దేశం మీదికి వచ్చిన మూడవ తెగులు.
తర్వాత వచ్చిన తెగుళ్ళు కేవలం ఐగుప్తీయుల మీదికే వచ్చాయి గానీ ఇశ్రాయేలీయుల మీదికి రాలేదు. నాలుగవ తెగులులో ఐగుప్తీయుల ఇళ్ళు పెద్ద ఈగలతో నిండిపోయాయి. ఐదవ తెగులు జంతువుల మీదికి వచ్చింది. ఐగుప్తీయుల పశువులు, గొర్రెలు, మేకలు ఎన్నో చచ్చిపోయాయి.
ఆ తర్వాత మోషే అహరోనులు కొంత బూడిదను తీసుకొని గాల్లోకి విసిరారు. అది జంతువులకు, ప్రజలకు పుండ్లు వచ్చేలా చేసింది. అది ఆరవ తెగులు.
ఆ తర్వాత మోషే తన చేతిని ఆకాశము వైపుకు ఎత్తగానే యెహోవా ఉరుములను వడగండ్లను పంపాడు. అది ఐగుప్తులో అంతకుముందెన్నడూ రానంత గొప్ప వడగండ్ల తుఫాను.
ఎనిమిదవ తెగులు పెద్ద గుంపులుగా వచ్చి పడిన మిడతలు. అంతకుముందు లేదా ఆ తర్వాత ఎప్పుడూ అన్ని మిడతలు రాలేదు. వడగండ్లవల్ల నాశనం కాకుండా మిగిలిన వాటినన్నిటిని అవి తినేశాయి.
తొమ్మిదవ తెగులు చీకటి. మూడురోజులు దేశాన్నంతటిని గాఢాంధకారం కమ్ముకుంది. కానీ ఇశ్రాయేలీయులు నివసించే చోట మాత్రం వెలుగు ప్రకాశించింది.
చివరగా, దేవుడు తన ప్రజలకు తమ ద్వారబంధాలపై గొర్రెపిల్ల రక్తాన్ని లేక మేకపిల్ల రక్తాన్ని చల్లమన్నాడు. ఆ తర్వాత దేవదూత ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. దేవదూత ద్వారబంధంపై రక్తాన్ని చూసినప్పుడు ఆ ఇంట్లో ఎవరినీ చంపలేదు. ద్వారబంధాలపై రక్తంలేని ఇళ్ళలో మనుష్యులలోను, జంతువులలోను తొలి సంతానాన్ని దేవదూత చంపేశాడు. అదే పదవ తెగులు.
ఆ చివరి తెగులు తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను పొమ్మన్నాడు. దేవుని ప్రజలు వెళ్ళడానికి పూర్తిగా సిద్ధపడి, ఆ రాత్రే ఐగుప్తునుండి బయలుదేరారు.
నిర్గమకాండము 7 నుండి 12 అధ్యాయాలు.
ప్రశ్నలు
- ఇక్కడ చూపించబడిన చిత్రాలను ఉపయోగించి, యెహోవా ఐగుప్తుపైకి తెచ్చిన మొదటి మూడు తెగుళ్ళను వివరించండి.
- మొదటి మూడు తెగుళ్ళకు, మిగతా తెగుళ్ళకు మధ్య తేడా ఏమిటి?
- నాలుగవ, ఐదవ, ఆరవ తెగుళ్ళు ఏమిటి?
- ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ తెగుళ్ళను వర్ణించండి.
- పదవ తెగులుకు ముందు యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమి చేయమని చెప్పాడు?
- పదవ తెగులు ఏమిటి, దాని తర్వాత ఏమి జరిగింది?
అదనపు ప్రశ్నలు
- నిర్గమకాండము 7:19-8:23 చదవండి.ఐగుప్తులోని శకునగాండ్రు యెహోవా రప్పించిన మొదటి రెండు తెగుళ్ళను నకలు చేయగలినా, మూడవ తెగులు తర్వాత వాళ్ళు ఏమి అంగీకరించవలసి వచ్చింది? (నిర్గ. 8:18, 19; మత్త. 12:24-28)యెహోవాకు తన ప్రజలను రక్షించే సామర్థ్యం ఉందని నాలుగవ తెగులు ఎలా చూపించింది, దేవుని ప్రజలు ప్రవచించబడిన “మహాశ్రమలు”ఎదుర్కోబోతుండగా ఆ విషయాన్ని తెలుసుకోవడం వాళ్ళకు ఎలాంటి హామీ ఇస్తుంది? (నిర్గ. 8:22, 23; ప్రక. 7:13, 14; 2 దిన. 16:9)
- నిర్గమకాండము 8:24; 9:3, 6, 10, 11, 14, 16, 23-25; 10:13-15, 21-23 చదవండి.పది తెగుళ్ళు ఏ రెండు వర్గాలకు చెందిన ప్రజలపైకి తీసుకురాబడ్డాయి, నేడు మనం ఆ వర్గాలకు చెందినవాళ్ళను దృష్టించే విధానంపై అది ఎలా ప్రభావం చూపుతుంది? (నిర్గ. 8:10, 18, 19; 9:14)సాతాను ఇప్పటివరకూ ఉండడానికి యెహోవా ఎందుకు అనుమతించాడో అర్థం చేసుకోవడానికి మనకు నిర్గమకాండము 9:16 ఎలా సహాయం చేస్తుంది? (రోమా. 9:21, 22)
- నిర్గమకాండము 12:21-32 చదవండి.పస్కావల్ల చాలామందికి రక్షణ ఎలా కలిగింది, అది దేనివైపుకు అవధానం మళ్ళించింది? (నిర్గ. 12:21-23; యోహా. 1:29; రోమా. 5:18, 19, 21; 1 కొరిం. 5:7)
Post a Comment