యెఫ్తా వాగ్దానం
మీరు ఎప్పుడైనా ఒక వాగ్దానం చేసిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం కష్టంగా ఉన్నట్లు భావించారా? ఈ చిత్రంలోని వ్యక్తికి అలాగే జరిగింది, అందుకే ఆయన చాలా దుఃఖిస్తున్నాడు. ఆ వ్యక్తి యెఫ్తా అనే పేరుగల ధైర్యవంతుడైన ఇశ్రాయేలు న్యాయాధిపతి.
యెఫ్తా ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం మానుకున్న కాలంలో జీవించాడు. ఇశ్రాయేలీయులు మళ్ళీ చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కాబట్టి వాళ్ళను అమ్మోనీయులు బాధపెట్టేందుకు యెహోవా అనుమతించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు, ‘మేము నీకు వ్యతిరేకముగా పాపము చేశాం. దయచేసి మమ్మల్ని రక్షించు!’ అని యెహోవాకు మొరపెట్టుకున్నారు.
చెడ్డ ప్రజలైన అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు యెఫ్తాను ఎన్నుకున్నారు. యుద్ధంలో యెహోవా తనకు సహాయం చేయాలని యెఫ్తా ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ఆయన యెహోవాకు ఇలా వాగ్దానం చేశాడు: ‘అమ్మోనీయులపై నువ్వు నాకు విజయం చేకూరిస్తే, విజయోత్సాహంతో నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి నా ఇంట్లోనుండి వచ్చే మొదటి వ్యక్తిని నేను నీకు అర్పిస్తాను.’
యెహోవా యెఫ్తా వాగ్దానాన్ని అంగీకరించి ఆయన విజయం పొందేలా సహాయం చేశాడు. యెఫ్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను కలవడానికి బయటికి వచ్చిన మొదట వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన ఒక్కగానొక్క కుమార్తే వచ్చింది. ‘నా కుమారీ! నాకు ఎంత దుఃఖాన్ని కలుగజేస్తున్నావు. నేను యెహోవాకు వాగ్దానం చేశాను, దానిని నేను వెనుకకు తీసుకోలేను’ అని యెఫ్తా విలపించాడు.
యెఫ్తా కుమార్తె ఆ వాగ్దానం గురించి విన్నప్పుడు మొదట ఆమె కూడా దుఃఖించింది. ఎందుకంటే ఆమె తన తండ్రిని, స్నేహితులను విడిచి వెళ్ళాలి. ఆమె తన మిగతా జీవితాన్నంతా షిలోహులో యెహోవా మందిరంలో ఆయనకు సేవచేస్తూ గడపాలి. కాబట్టి ఆమె తన తండ్రితో ‘నువ్వు యెహోవాకు వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలి’ అన్నది.
ఆ విధంగా యెఫ్తా కుమార్తె షిలోహుకు వెళ్ళి తన మిగతా జీవితాన్నంతా యెహోవాను సేవిస్తూ ఆయన మందిరంలోనే గడిపింది. ఇశ్రాయేలు స్త్రీలు సంవత్సరంలో నాలుగు రోజులు ఆమెను దర్శించడానికి వెళ్ళి, ఆమెతో సంతోషంగా సమయం గడిపేవారు. యెఫ్తా కుమార్తె యెహోవాకు చాలా మంచి సేవకురాలు కాబట్టి ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించారు.
న్యాయాధిపతులు 10:6-18; 11:1-40.
ప్రశ్నలు
- యెఫ్తా ఎవరు, ఆయన ఏ కాలంలో జీవించాడు?
- యెఫ్తా యెహోవాకు ఏమని వాగ్దానం చేశాడు?
- అమ్మోనీయులపై విజయం సాధించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యెఫ్తా ఎందుకు బాధపడ్డాడు?
- తన తండ్రి వాగ్దానం గురించి తెలుసుకున్నప్పుడు యెఫ్తా కుమార్తె ఏమి అన్నది?
- ప్రజలు యెఫ్తా కుమార్తెను ఎందుకు ఇష్టపడ్డారు?
అదనపు ప్రశ్నలు
- న్యాయాధిపతులు 10:6-18 చదవండి.ఇశ్రాయేలీయులు యెహోవాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించిన విధానం నుండి మనమే హెచ్చరికను లక్ష్యపెట్టాలి? (న్యాయా. 10:6, 15, 16; రోమా. 15:4; ప్రక. 2:10)
- న్యాయాధిపతులు 11:1-11, 29-40 చదవండి.యెఫ్తా తన కుమార్తెను “దహనబలిగా” ఇవ్వడం అంటే దానర్థం ఆమెను మానవ బలిగా అగ్ని ద్వారా అర్పించడం కాదని మనకు ఎలా తెలుసు? (న్యాయా. 11:31; లేవీ. 16:24; ద్వితీ. 18:10, 12)యెఫ్తా తన కుమార్తెను ఏ విధంగా ఒక బలిగా అర్పించాడు?యెఫ్తా తాను యెహోవాకు చేసిన వాగ్దానంపట్ల ప్రదర్శించిన వైఖరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 11:35, 39; ప్రసం. 5:4, 5; మత్త. 16:24)యౌవన క్రైస్తవులు పూర్తికాల సేవను తమ వృత్తిగా చేసుకోవడానికి యెఫ్తా కుమార్తె ఎలా ఒక మంచి మాదిరిగా ఉంది? (న్యాయా. 11:36; మత్త. 6:33; ఫిలి. 3:8)
Post a Comment