Drinking a child of God
చిన్నపిల్లవాడు దేవుణ్ణి సేవించడం
ఈ చిన్నపిల్లవాడు అందంగా కనిపిస్తున్నాడు కదా? ఆయన పేరు సమూయేలు. సమూయేలు తలపై చేతులుంచిన వ్యక్తి ఇశ్రాయేలు ప్రధాన యాజకుడైన ఏలీ. సమూయేలును ఏలీ దగ్గరకు తెచ్చింది తండ్రి ఎల్కానా మరియు తల్లి హన్నా.
సమూయేలు అప్పుడు కేవలం నాలుగు లేక ఐదు సంవత్సరాల వయస్సువాడే. ఇక్కడ యెహోవా మందిరంలోనే ఏలీతోను ఇతర యాజకులతోను ఉండడానికి వచ్చాడు. ఎల్కానా మరియు హన్నా ఇంత చిన్నపిల్లవాడైన సమూయేలును యెహోవా మందిరంలో సేవ చేయడానికి ఎందుకు ఇస్తున్నారు? మనం చూద్దాం.
ఇలా జరగడానికి కొన్ని సంవత్సరాల ముందు హన్నా ఎంతో దుఃఖంతో ఉండేది. దానికి కారణం ఆమెకు సంతానం కలుగకపోవడమే. తనకు ఒక బిడ్డ కావాలని ఆమె ఎంతో కోరుకుంది. అలా ఉండగా ఒకరోజు హన్నా యెహోవా మందిరానికి వచ్చి, ‘యెహోవా నన్ను మరువకుము! నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, అతను తన జీవిత కాలమంతా నీకు సేవ చేయడానికి అతన్ని నీకు సమర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రార్థించింది.
యెహోవా హన్నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు, కొన్ని నెలల తరువాత ఆమెకు సమూయేలు పుట్టాడు. హన్నాకు తన చిన్న బాబు అంటే ఎంతో ఇష్టం, అతను చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె అతనికి యెహోవా గురించి బోధించడం ప్రారంభించింది. ఆమె తన భర్తతో, ‘సమూయేలు పెద్దవాడై, పాలు విడిచిన వెంటనే, అతను యెహోవాను సేవించడానికి నేను అతనిని మందిరానికి తీసుకువెళ్తాను’ అని చెప్పింది.
హన్నా మరియు ఎల్కానా అలా చేయడాన్నే మనమిక్కడ చిత్రంలో చూస్తున్నాం. సమూయేలు తలిదండ్రులు అతనికి చక్కగా బోధించారు కాబట్టి అతను యెహోవా గుడారంలో ఆయనను సేవించగలుగుతున్నందుకు చాలా సంతోషించాడు. ప్రతి సంవత్సరం హన్నా మరియు ఎల్కానా ఈ ప్రత్యేక గుడారంలో ఆరాధించడానికి, తమ కుమారుణ్ణి చూడడానికి వస్తుండేవారు. హన్నా ప్రతి సంవత్సరం సమూయేలు కోసం చేతులులేని ఒక క్రొత్త చొక్కాను తయారుచేసి తీసుకొనివచ్చేది.
అలా సంవత్సరాలు గడిచే కొలది సమూయేలు యెహోవా మందిరంలోనే సేవ చేస్తూ ఉండేవాడు, ప్రజలూ అలాగే యెహోవా ఆయనను ఎంతగానో ఇష్టపడేవారు. అయితే ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు మంచివాళ్ళు కాదు. వాళ్ళు చాలా చెడ్డపనులు చేస్తూ, ఇతరులు కూడా యెహోవాకు అవిధేయత చూపించడానికి కారణమయ్యేవారు. ఏలీ వాళ్ళను యాజకుల స్థానం నుండి తీసివేయాలి, కానీ ఆయన తీసివేయలేదు.
గుడారంలో జరుగుతున్న చెడు కార్యాల కారణంగా సమూయేలు యెహోవాను సేవించడం ఆపుచేయలేదు. యెహోవాను ప్రేమించే వాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు కాబట్టి యెహోవా మానవులతో మాట్లాడి చాలా కాలమయ్యింది. సమూయేలు కొంచెం పెద్దవాడైనప్పుడు ఇలా జరిగింది:
సమూయేలు గుడారంలో నిద్రిస్తున్నప్పుడు ఒక స్వరం ఆయనను నిద్ర లేపింది. అప్పుడు ఆయన, ‘చిత్తము’ అని సమాధానమిచ్చి, లేచి ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళి, ‘మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను’ అన్నాడు.
అయితే ఏలీ, ‘నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో’ అని చెప్పాడు. కాబట్టి సమూయేలు వెళ్ళి పడుకున్నాడు.
తర్వాత రెండవసారి, ‘సమూయేలు!’ అనే పిలుపు వినపడింది. సమూయేలు మళ్ళీ లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, ‘మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను’ అన్నాడు. కానీ ఏలీ, ‘నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో’ అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్ళి పడుకున్నాడు.
ఆ స్వరము మూడవసారి ‘సమూయేలూ!’ అని పిలవడం వినపడింది. సమూయేలు మళ్ళీ ఏలీ దగ్గరకు పరుగెత్తాడు. ‘ఇదిగో నేను వచ్చాను, మీరు ఈసారి తప్పకుండా నన్ను పిలిచి ఉంటారు’ అన్నాడు. అయితే అలా పిలుస్తుంది యెహోవాయే అని ఏలీకి అప్పుడు అర్థమయ్యింది. కాబట్టి ఆయన సమూయేలుతో, ‘ఈసారి కూడా వెళ్ళి పడుకో. ఆయన మళ్ళీ పిలిస్తే, “యెహోవా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు” అని చెప్పు’ అన్నాడు.
యెహోవా మళ్ళీ పిలిచినప్పుడు సమూయేలు అలాగే అన్నాడు. అప్పుడు యెహోవా తాను ఏలీని, ఆయన కుమారులను శిక్షించబోతున్నట్లు సమూయేలుకు చెప్పాడు. తర్వాత హొఫ్నీ, ఫీనెహాసు ఫిలిష్తీయుల యుద్ధంలో మరణించారు. జరిగిన సంగతి తెలియగానే ఏలీ క్రిందపడి మెడవిరిగి చనిపోయాడు. యెహోవా మాట నిజమయ్యింది.
సమూయేలు పెద్దవాడై, ఇశ్రాయేలుకు చివరి న్యాయాధిపతి అయ్యాడు. ఆయన వృద్ధుడైనప్పుడు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి, ‘మాకు ఒక రాజును ఏర్పాటు చెయ్యి’ అని అడిగారు. సమూయేలు అలా చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే నిజానికి యెహోవాయే వాళ్ళ రాజు. అయితే యెహోవా ప్రజలమాట వినమని ఆయనకు చెప్పాడు.
1 సమూయేలు 1:1-28; 2:11-36; 4:16-18; 8:4-9.
ప్రశ్నలు
- చిత్రంలోని అబ్బాయి పేరేమిటి, అతనితోపాటు ఉన్న ఇతరులు ఎవరు?
- హన్నా ఒకరోజు యెహోవా గుడారానికి వెళ్ళి ఏమని ప్రార్థించింది, యెహోవా ఆమె ప్రార్థనకు ఎలా సమాధానమిచ్చాడు?
- యెహోవా గుడారంవద్ద సేవచేయడానికి తీసుకోబడినప్పుడు సమూయేలు వయసెంత, ఆయన తల్లి ఆయనకోసం ప్రతి సంవత్సరం ఏమి చేస్తుండేది?
- ఏలీ కుమారుల పేర్లేమిటి, వాళ్ళు ఎలాంటివాళ్ళు?
- యెహోవా సమూయేలును ఎలా పిలిచాడు, ఆయన సమూయేలుకు ఏమని చెప్పాడు?
- సమూయేలు పెద్దవాడయ్యాక ఏమయ్యాడు, ఆయన వృద్ధుడయినప్పుడు ఏమి జరిగింది?
అదనపు ప్రశ్నలు
- మొదటి సమూయేలు 1:1-28 చదవండి.సత్యారాధన విషయంలో ముందుండడంలో కుటుంబ శిరస్సులకు ఎల్కానా ఎలాంటి చక్కని మాదిరిని ఉంచాడు? (1 సమూ. 1:3, 21; మత్త. 6:33; ఫిలి. 1:10)కలవరపెట్టే సమస్యతో వ్యవహరించే విషయంలో హన్నా ఉదాహరణ నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (1 సమూ. 1:10, 11; కీర్త. 55:22; రోమా. 12:12)
- మొదటి సమూయేలు 2:11-36 చదవండి.ఏలీ తన కుమారులను యెహోవాకంటే గొప్పగా ఎలా ఎంచాడు, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉండగలదు? (1 సమూ. 2:22-24, 27, 29; ద్వితీ. 21:18-21; మత్త. 10:36, 37)
- మొదటి సమూయేలు 4:16-18 చదవండి.యుద్ధంనుండి ఏ నాలుగు దుర్వార్తలుగల సమాచారం అందింది, అది ఏలీపై ఎలాంటి ప్రభావం చూపించింది?
- మొదటి సమూయేలు 8:4-9 చదవండి.ఇశ్రాయేలీయులు ఎలా యెహోవా మనస్సును ఎంతగానో నొప్పించారు, మనం నేడు ఎలా ఆయన రాజ్యాన్ని నమ్మకంగా సమర్థించవచ్చు? (1 సమూ. 8:5, 7; యోహా. 17:16; యాకో. 4:4)