మంచి కుమారుడు, చెడ్డ కుమారుడు
ఇప్పుడు కయీనును, హేబెలును చూడండి. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. కయీను వ్యవసాయకుడయ్యాడు. అతను ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను పండించేవాడు.
హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. ఆయనకు చిన్న గొర్రె పిల్లలను పెంచడమంటే ఇష్టం. అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి కొద్దికాలానికే హేబెలు చూసుకోవడానికి పెద్ద గొర్రెల మంద తయారయ్యింది.
ఒకరోజు కయీను, హేబెలు దేవునికి అర్పణ తెచ్చారు. కయీను తాను పండించిన పంటను తెచ్చాడు. హేబెలు తన దగ్గరున్న మంచి గొర్రెను తెచ్చాడు. యెహోవా హేబెలును, ఆయన అర్పణను చూసి సంతోషించాడు గాని, కయీనును అతని అర్పణను చూసి సంతోషించలేదు. ఎందుకో తెలుసా?
హేబెలు అర్పణ కయీను అర్పణ కంటె మంచిదైనందుకు యెహోవా ఆయనను చూసి సంతోషించలేదు. హేబెలు మంచివాడు కాబట్టే దేవుడు ఆయనను చూసి సంతోషించాడు. హేబెలు యెహోవాను, తన సహోదరుణ్ణి ప్రేమించాడు. అయితే కయీను చెడ్డవాడు, అతను తన సహోదరుణ్ణి ప్రేమించలేదు.
కాబట్టి తన మార్గాలను మార్చుకొమ్మని దేవుడు కయీనుతో చెప్పాడు. కానీ కయీను వినలేదు. దేవుడు హేబెలును ఎక్కువగా ఇష్టపడినందుకు అతను కోపం పెంచుకున్నాడు. అందుచేత కయీను హేబెలుతో, ‘మనం పొలానికి వెళ్దాము పద’ అన్నాడు. పొలంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలుపై పడి, ఆయన చనిపోయేంత గట్టిగా కొట్టాడు. కయీను చేసిన పని ఎంత ఘోరమైనదో కదా?
హేబెలు చనిపోయినా దేవుడు ఆయనను గుర్తుంచుకున్నాడు. హేబెలు మంచివాడు, అలాంటి వ్యక్తిని యెహోవా ఎన్నడూ మరచిపోడు. కాబట్టి యెహోవా ఒక రోజున హేబెలును తిరిగి బ్రతికిస్తాడు. అప్పుడు హేబెలు మళ్ళీ చనిపోవలసిన అవసరముండదు. ఆయన ఇదే భూమిపై నిత్యమూ జీవించగలుగుతాడు. హేబెలులాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం బాగుంటుంది కదూ?
అయితే కయీనులాంటి వ్యక్తులను మాత్రం దేవుడు ఇష్టపడడు. అందుకే తన సహోదరుణ్ణి చంపిన తర్వాత కయీనును శిక్షిస్తూ దేవుడు ఆయనను తన కుటుంబానికి దూరంగా పంపించాడు. కయీను భూమిపై మరో ప్రాంతంలో జీవించడానికి వెళ్ళినప్పుడు తనతోపాటు తన సహోదరీలలో ఒకరిని తీసుకొనివెళ్ళాడు. ఆమె ఆయనకు భార్య అయ్యింది.
కొంతకాలానికి కయీనుకు ఆయన భార్యకు పిల్లలు పుట్టడం ప్రారంభించారు. ఆదాము హవ్వల మిగిలిన కుమారులు కుమార్తెలు పెళ్ళి చేసుకొన్నారు, వారికి కూడా పిల్లలు పుట్టారు. కొద్దికాలానికే భూమ్మీద చాలామంది ప్రజలు తయారయ్యారు. వారిలో కొందరి గురించి మనం తెలుసుకుందాం.
ఆదికాండము 4:2-26; 1 యోహాను 3:11, 12; యోహాను 11:25.
Post a Comment