బైబిలు గొప్పా? లేక సైన్స్ గొప్పా?
పై ప్రశ్నను సమాధానాన్ని క్రైస్తవులను అడిగితే "బైబిలే గొప్ప" అంటారు. అదే అన్యజనులను అడిగితే "శాస్త్రమే గొప్పది" అంటారు. బైబిలులోని విషయాలు గురించి కొన్ని వందల సంవత్సరాల కాలంగా క్రైస్తవులకు, శాస్త్రవేత్తలకు మధ్య వాదనలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వ సృష్టి అంతా ఏడు రోజుల్లోనే పూర్తయ్యిందని బైబిలు చెబుతుంటే సైన్స్ మాత్రం కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిందని చెబుతుంది. అలాగే భూమి తరువాత సూర్యుడు కలిగెనని బైబిలులో ఉంటే, సూర్యుడి తరువాతనే భూమి ఏర్పడినట్లు సైన్స్ చెబుతుంది. అలాగే మట్టి నుంచి మానవుడు సృష్టింపబడ్డాడని బైబిలు చెబుతుంటే, రసాయనాల కలయిక వల్లే ఏక కణ జీవి ఏర్పడి చివరకు మానవజాతి ఏర్పడిందని సైన్స్ చెబుతుంది. ఇలా బైబిలులోని పలు విషయాలను సైన్స్ ఖండిస్తుంది.
సుదీర్ఘకాల పరిశోధన తరువాత శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని క్రెస్తవులు ఎందుకు కాదంటున్నారు?. భూమిని ఫలానా గ్రహ శకలం (ఆస్టరాయిడ్) ఢీకొనబోతుంది అని చెప్పినా, ప్రాణాంతక ఆంత్రాక్స్, స్వైన్ ఫ్లూ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెబితే మాత్రం శాస్త్రవేత్తల మాటలను ఎందుకు అంత గట్టిగా నమ్మేస్తున్నాం?. అన్నీ విషయాల్లో శాస్త్రవేత్తల మాటలను, శాస్త్ర పరిశోధనలను నమ్మే మనం బైబిలులోని విషయాలు గురించి శాస్త్రవేత్తల సిద్ధాంతాలను మాత్రం ఎందుకు నమ్మటానికి సిద్ధంగా లేము?, దానికి కారణం, శాస్త్రం చెప్పే పలు విషయాలు బైబిలులోని విషయాలకు విరుద్ధంగా ఉండటమే.
నిజానికి, బైబిలుతో శాస్త్రం విభేధించడం లేదు. బదులుగా మన దేవుడు మహోన్నతుడని, సర్వోన్నతుడని, సర్వ శక్తిమంతుడని చెబుతుంది. అయితే లేఖనాల లోతైన భావాన్ని పరిశీలించకపోవడం వల్ల బైబిలులోని విషయాలకు సైన్స్ చెబుతున్న సిద్ధాంతాలు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నాం. శాస్త్రం చెప్పేది బైబిలులోని విషయానికి విరుద్ధంగా ఉందనిపిస్తే 'మరి బైబిలులో ఎందుకలా చెప్పబడినది' అని ప్రశ్నించుకోవడంతో పాటు లేఖనాలను విశ్లేషించాలి. అప్పుడే లేఖనముల యొక్క లోతైన భావం గ్రహించగలం. బైబిలు మరియు సైన్స్ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పాలంటే, బైబిలులో సంక్షిప్తంగా చెప్పబడిన పలు విషయాలను సైన్స్ విశదీకరిస్తుంది. అంటే, బైబిలులోని విషయాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేదే సైన్స్.
Post a Comment