Halloween Costume ideas 2015

Tabernacle of Moses Telugu

ప్రత్యక్షపు గుడారము గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

ప్రత్యక్షపు గుడారము గురించి బైబిల్ లో చాల అధ్యాయాలలో రాయబడింది. ఎంతో ప్రాముఖ్యమైనది గనుక పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని అనేకసార్లు ప్రస్తావించాడు. యింత సవిస్తరంగా వివరించిన ప్రత్యక్షపు గుడారము నిర్మాణం గురించి, అందులో అర్పించే బలులు, అర్పణలు గురించి చాలా మంది చదవరు.
ఈ తెరలు ఏంటి? ఈ పలకలు, దిమ్మలు, స్తంభాలు, అడ్డకర్రలు, వంకులు, పెండేబద్దలు అసలు యివన్నీ ఏంటి అని, వీటితో ఏమి అవసరం అని పేజీలు తిప్పేస్తుంటారు...  యింకా యౌవనస్తులు అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కొలతలు, ఆ మూరలు రాగానే ఏమి కొలతలురా నాయనా అని ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేసుకొంటు వెళ్తుంటారు. (పేపర్స్ లో వచ్చే పజిల్స్ ని జెనరల్ ఇంటలిజెన్స్ కి సంబంధించిన లెక్కలని మాత్రం బాగా చేస్తారు. బైబిల్ లో దేవుడు రాయించిన లెక్కలు గురించి మాత్రం ఆలోచించరు)

పరిశుద్ద గ్రంధమంతటిలో ప్రత్యక్షపు గుడారము అంత వివరణ ఏ ఒక్క అంశము మీద కూడా రాయబడలేదు. దేవుని పిల్లలు ఈ అంశాన్ని మనసు పెట్టి (శ్రద్ధతో) చదవకపోవడం చాలా విచారకరమయిన సంగతి. ప్రత్యక్షపు గుడారము గురించి చదువుతున్నప్పుడు ఆ ఉపకరణాలు, ఆ కొలతలు, ఆ నిర్మాణం, ఆ బలులు - అర్పణలు, యాజకుని సేవా ధర్మాలు మనకు అనవసరం అనిపించినప్పటికీ 2 తిమోతి 3:16 ప్రకారం దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదా.... కొంతమంది పాత నిబంధన అవసరం లేదు అనుకొంటూ ఉండొచ్చు. కానీ, పాత నిబంధన లో రాసిన సంగతులని మనకు బుద్ది కలుగుటకై రాయబడినవి అని మర్చిపోకండి సుమా. (రోమా 15:4; 1 కొరింథీ 10:6). పైగా ప్రత్యక్షపు గుడారము కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక లో రాయబడింది. ఈ పత్రిక అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యాకాండాల మీద అవగాహన ఉండాలి.

పరిశుద్దాత్మ దేవుడు ఈ అంశాన్ని కొత్త నిబంధనలో కూడా రాయించాడు అంటే సంఘానికి ఏదో నేర్పించాలి అనేగా? వ్యర్థంగా ఏది రాయించడు అని ప్రతీది మన ప్రయోజనం కొరకే అని 2 తిమోతి 3:16 వచనంలో చూసాముగా. మరి యింత సవిస్తరంగా రాయబడిన అంశం గురించి మీరు తెలుసుకోవాలని ఆశ పడుతున్నారా? ఒకవేళ యింతవరకు నిర్లక్ష్యం చేసి ఉంటె యిప్పుడైనా శ్రద్ధ పెట్టి చదవండి. ప్రత్యక్షపు గుడారము రెఫెరెన్సులు :

ప్రత్యక్షపు గుడారము అంశము నిర్గమకాండము 25 వ అధ్యాయములో ప్రారంభం అవుతుంది. నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలలో ప్రత్యక్షపు గుడారము గురించి రెండు సార్లు రాయబడినట్లుగా మనకు కనబడుతుంది. నిజమే. ప్రత్యక్షపు గుడారమును ఎలా కట్టారో, అందులో 7 పరికరములను ఎలా తయారు చేయాలో దేవుడు మోషేకి వివరించినప్పుడు ఒకసారి రాయబడింది, ఆ వివరణ అంతా నిర్గమకాండము 25,26,27,30 అధ్యాయాలలో ఉంటుంది. రెండోసారి ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా కట్టారో, అందులో 7 పరికరములను ఏ విధంగా తయారు చేసారో నిర్గమ 36,37,38 అధ్యాయాలలో ఉంటుంది... ఆ విధంగా ప్రత్యక్షపు గుడారము నిర్మాణం గురించి రెండుసార్లు రాయబడినట్లుగా కనబడుతుంది. ఈ అంశం ఎంతో ప్రాముఖ్యమైనది కనుకనే పరిశుద్దాత్మ దేవుడు రెండుసార్లు ప్రస్తావించాడు. ఈ ప్రాముఖ్యమైన అంశము గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్గమకాండము 25 నుండి 40 అధ్యాయాలు కనీసం రెండుసార్లు చదవండి. లేవియాకాండము, సంఖ్యాకాండము కూడా చదవండి.

మీ కోసం ప్రత్యక్షపు గుడారము రెఫెరెన్సులను విభజించి ఇవ్వడం జరిగింది... వీటిని note చేసుకోండి...
1) ప్రత్యక్షపు గుడారమును ఎలా కట్టాలో మోషేకి చెప్పుట (నిర్గమ 26 వ అధ్యాయం, 27:9-19 వచనాలు)
2) ప్రత్యక్షపు గుడారమును ఏ విధంగా కట్టారో వివరించుట (నిర్గమ 36 వ అధ్యాయం ; 38:9-20 వచనాలు)
3) ప్రత్యక్షపు గుడారములో పెట్టవలసిన 7 పరికరముల యొక్క రెఫెరెన్సులు ....
a) మందసము (నిర్గమ 25:10-17 ; 37:1-5 ; సంఖ్యా 17:1-13 ; హెబ్రీ 9:4)
b) కరుణాపీటం (నిర్గమ 25:18-22 ; 37:6-9 ; 2 రాజులు 19:14-15 ; యెషయా 6:1-8)
c) సముఖపు రొట్టెల బల్ల (నిర్గమ 25:23-30 ; 37:10-16 ; లేవియా 24:5-9)
d) దీపవృక్షం (నిర్గమ 25:31-40 ; 37:17-24 ; లేవియా 8:1-4) దీపస్తంభము.
e) ఇత్తడి బలిపీటం (నిర్గమ 27:1-8 ; 38:1-7 ; 29:38-46 ; లేవియా 6:8-12)
f) ధూపవేధిక (నిర్గమ 30:1-10 ; 37:25-29) బంగారు బలిపీటం
g) గంగాళము (నిర్గమ 30:17-21 ; 38:8)
4) ప్రత్యక్షపు గుడారము పనిలో వాడిన సామాగ్రి (నిర్గమ 35:4-19 ; 39:33-43)
5) ప్రత్యక్షపు గుడారము కట్టుటలో పని చేసినవారు (నిర్గమ 31:1-11 ; 35:30-35 ; 36:1-8 ; 38:22-23 ; 35:25)
6) ప్రత్యక్షపు గుడారమును రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి తేదీన నిలబెట్టబడెను (నిర్గమ 40:17)
7) ప్రత్యక్షపు గుడారము కోసము ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలు (నిర్గమ 35:20-29 ; 30:11-16 ; 38:24-26)
8 ) ప్రత్యక్షపు గుడారమును నిలువబెట్టుట మరియు అభిషేకించుట (నిర్గమ 40 వ అధ్యాయం ; 30:22-29)
9) ప్రత్యక్షపు గుడారమును మేఘము కమ్ముట (నిర్గమ 40:34-35 ; సంఖ్యా 9:15-23)
10) ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు నియమింపబడినవారు లేవీయులు. యాజక వంశం వీరిది. (సంఖ్యా 1:47-54 ; 3,4,18 అధ్యాయాలు, ద్వితియో 33:10-11)
11) ప్రత్యక్షపు గుడారములో యాజకులు ఎలా సేవ చేయాలో, బలులు - అర్పణలు ఎలా అర్పించాలో లేవి, సంఖ్యాకాండాలలో వివరించడం జరిగింది.
12) ప్రత్యక్షపు గుడారము గురించి మరి కొన్ని రెఫెరెన్సులు (హెబ్రీ 7,8,9,10 అధ్యాయాలు ; మార్కు 15:38 ; 1 పేతురు 1:18-19)
"నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను." నిర్గమ 25:8

ప్రత్యక్ష గుడారము ప్రాముఖ్యత (ఈ అంశాన్ని నిర్లక్ష్యము చేసే ప్రతి ఒక్కరు తప్పక చదవండి)
దేవుడు మానవుల మధ్య నివసించుటకు ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారము గురించి అందులో బలులు - అర్పణలు గురించి 50 అధ్యాయాలలో పైగానే రాయబడింది... చాలా మంది ప్రత్యక్ష గుడారము టాపిక్ రాగానే దీనితో ఏమి అవసరములే, మనకు క్రొత్త నిబంధన ఉంది కదా, అది చాలులే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ క్రొత్త నిబంధన లో కూడా పరిశుద్దాత్మ దేవుడు ప్రత్యక్ష గుడారము గురించి హెబ్రీ పత్రికలో 4 అధ్యాయాలలో రాయించాడు. ఈ అధ్యాయాలు అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యా కాండాల మీద తప్పక అవగాహన ఉండాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రత్యక్ష గుడారము గురించి దేవుడు రాయించాడు అంటే ఈ అంశము ద్వారా దేవుడు తన సంఘానికి ఏదో నేర్పించాలి అని ఆశిస్తున్నాడు అనేగా అర్థం. 2 తిమోతి 3:16,17 ప్రకారం పరిశుద్దాత్ముడు రాయించిన ప్రతి లేఖనము ప్రయోజనకరమైనది కదా! కానీ ఈరోజు సంఘము ప్రత్యక్ష గుడారమును ప్రయోజనకరమైనదిగా భావించకపోవడం బాధాకరం.

క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా ప్రత్యక్ష గుడారము గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. "ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో కొన్ని విషయాలు తెలుసుకొందాము. తరువాయి భాగములో మిగతా విషయాలు తెలుసుకొందాము."
ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ప్రత్యక్ష గుడారము ప్రాముఖ్యంగా 3 అంశాలను తెలియచేస్తుంది.
1) ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమగు సంగతులకు సాదృశ్యంగా ఉంది. (హెబ్రీ 8:5). అనగా పరలోకంలో ఆరాధనా స్థలం (ఆలయం) ఒకటి ఉంది. అక్కడ దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడై కెరూబుల మధ్య నివసిస్తున్నాడని కీర్తనలు 11:4 ; ప్రకటన 7:15 ; 2 రాజులు 19:15 లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే విధంగా మనము ప్రత్యక్ష గుడారమును గమనించినట్లైతే "అతి పరిశుద్ద స్థలంలో" కరుణా పీటం ఉంటుంది. కరుణా పీటం దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. ఆ కరుణా పీటం మీద రెండు కెరూబులు చేయబడి ఉంటాయి. వాటి మధ్య నుండి నేను మాట్లాడతాను అని దేవుడు తెలియచేసాడు. (నిర్గమ 25:22 ; 1 సమూయేలు 4:4)

నిర్గమ 25:8 లో నేను వారిలో నివసించునట్లు నాకు పరిశుద్ద స్థలం నిర్మింపవలెను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రకటన 21 వ అధ్యాయాన్ని గమనించినట్లైతే పరలోక సంబంధమగు జెరూసలేము పట్టణముతో (తనని విశ్వసించిన ప్రజలతో) దేవుని నివాసం శాశ్వతంగా వుండబోతుందని మనకు తెలుస్తుంది, అందుకు ఈ లోకంలో కట్టబడిన ప్రత్యక్ష గుడారము ముంగుర్తుగా దేవుని నివాస స్థలముగా నిర్మించబడింది... ఈ విధంగా ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమైన సంగతులకు సాదృశ్యంగా వుంది. 2) ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా వున్నది. ప్రత్యక్ష గుడారము ఒక ఛాయా (నీడ) మాత్రమే.... నీడ ఏర్పడాలి అంటే అసలు వస్తువు ఉండాలి కదా, ఆ అసలు వస్తువే మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు. అసలు ప్రత్యక్ష గుడారములోని ప్రతి వస్తువు యేసు క్రీస్తు పరిచర్యను, దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి.... (అవన్నీ వివరంగా ముందు భాగములలో తెలుసుకుందాము.)

3) ప్రత్యక్ష గుడారము సంఘాన్ని సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారము అరణ్యములో కట్టబడుతుంది... అరణ్యములో ప్రయాణించబడుతుంది.... తర్వాత కానానుకు చేర్చబడుతుంది.... అదే విధంగా "సంఘము" కూడా ఈ అరణ్యంలాంటి లోకంలో కట్టబడింది. ఇప్పుడు సంఘము కూడా ఈ లోకంలో ప్రయాణించి "పరమ కానానుకు" అనగా పరలోక సంబంధమగు జెరుసలేము పట్టణముకు చేరవలసి వుంటుంది... అక్కడ మన నివాసం దేవునితో శాశ్వతంగా ఉండిపోతుంది. మరో రకంగా చెప్పాలంటే అరణ్యంలో ప్రత్యక్షపు గుడారము దేవుని నివాస స్థలం అయితే (నిర్గమ 25:8) నేడు "సంఘం దేవుని నివాస స్థలం" ఈ సంఘం క్రీస్తు అను సజీవమగు రాయిపై కట్టబడిన విశ్వాసుల సమూహము. నేడు దేవుడు "రాళ్ళతో కట్టబడిన మందిరాలలో నివాసం చేయడు. కాని ప్రజలు అనబడే ఆధ్యాత్మిక ఆలయాలలో నివాసం ఉంటాడు. (1 కొరింథీ 3:16-17).

"ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." మత్తయి 18:20
ఈ విధంగా ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారములోని 7 పరికరములు, వాటిని తయారు చేయడానికి వాడిన వస్తువులు అనేక విషయాలను తెలియచేస్తాయి. ఒక సంఘము (విశ్వాసులు) ఎలా ఎదగాలి అనేది కూడా ప్రత్యక్ష గుడారము తెలియచేస్తుంది

ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం :
ప్రత్యక్ష గుడారమును ఏ విధంగా నిర్మించారో నిర్గమ 26,36 అధ్యాయాలు మరియు నిర్గమ 27:9-17 వచనాలు, 38:9-20 వచనాలు తెలియచేస్తున్నాయి. ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం అర్థం చేసుకోవడం కాస్త కష్టతరం. అయినప్పటికీ కాస్త మీకు అర్థం అవ్వులాగున వివరించడం జరిగింది ఆలకించండి.
1) పునాది (నిర్గమ 26:15-30 ; 36:20-34)
ప్రత్యక్ష గుడారము పునాదికి తుమ్మకర్రతో చేయబడిన 48 పలకలను, 96 వెండి దిమ్మలను ఉపయోగించారు. ప్రతి పలక పొడుగు 10 మూరలు (15 అడుగులు), వెడల్పు మూరెడునర (2:25 అడుగులు), ప్రతి పలక అడుగు భాగాన రెండు కుసులు (Tenons or pegs) ఉంటాయి. ఈ "కుసులు" పలకలను వెండి దిమ్మలను కలుపుతాయి. ప్రతి పలకను ఈ కుసుల సహాయంతో 2 దిమ్మల మీద నిలబెడతారు. అలా కుడివైపును 20 పలకలను 40 వెండి దిమ్మల మీద, ఎడమ వైపున 20 పలకలను 40 వెండి దిమ్మలమీద, వెనుక భాగమున 6 పలకలను 12 వెండి దిమ్మల మీద, మూలలకు 2 పలకలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ముందు భాగమున అనగా తూర్పున గుడారపు ద్వారము ఉంటుంది. అలా పలకలను వెండి దిమ్మల మీద నిలబెట్టిన తర్వాత తుమ్మకర్రతో అడ్డకర్రలను 3 భాగములుగా చేసి కుడివైపున 5, ఎడమ వైపున 5, వెనుక భాగమున 5 అడ్డ కర్రలను "బంగారు ఉంగరములతో" పలకలకి అమర్చుతారు. యిందులో "నడిమి అడ్డకర్ర" ఈ కొస (corner) నుండి, ఆ కొస వరకు వుంటుంది (end to end). ఆ తర్వాత పలకలకు, అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగిస్తారు. తర్వాత నేలకు మేకులను కొట్టి, ఆ మేకులను పలకని కలుపుతూ త్రాళ్ళు కడతారు. యిది పునాది (నిర్గమ 35:18 ; 38:31).

2) అడ్డతెర :
ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల (blue, purple, scarlet yarn) అడ్డతెరని పేనిన సన్ననారతో (fine woven linen) చేసి ఆ అడ్డతెర మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెరను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడిన 4 స్తంభముల మీద ఈ అడ్డతెరను వేస్తారు. ఈ 4 స్తంభాలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు (hooks) వుంటాయి. ఈ వంకులకు అడ్డతెరను తగిలిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెర లోపల భాగాన్ని "అతి పరిశుద్ద స్థలము అని, అడ్డతెర వెలుపటి భాగాన్ని పరిశుద్ద స్థలము అని అంటారు. (నిర్గమ 26:31-33 ; 36:35-36).

3) గుడారపు ద్వారము :
ఇప్పుడు ఈ గుడారపు ద్వారమునకు తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడిన 5 స్తంభములను, 5 యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు వుంటాయి. ఈ 5 స్తంభములను ఒకదానితో ఒకటి కలుపుతూ "పెండే బద్దలు" (rods, కర్ర) ఉంటాయి. ఈ పెండే బద్దలు కూడా బంగారు రేకుతో పొదిగింపబడి ఉంటాయి. ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో ఒక తెరని చేసి ఆ స్తంభములకు వున్నటువంటి బంగారు వంకులకు తెరను తగిలిస్తారు. యిదే గుడారపు ద్వారము (నిర్గమ 26:36-37 ; 36:37-38).

4) తెరలను కప్పుట :
నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో 10 తెరలను చేసి, ఆ 10 తెరల మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఒక్కొక్క తెర పొడుగు 28 మూరలు (42 అడుగులు), వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఇప్పుడు 5 తెరలను ఒకదానితో ఒకటి కలిపి మొదటి కూర్పుగా (coupling, set) చేస్తారు. ఈ కూర్పు చివరన "50 కులుకులను (loops)" చేస్తారు. మిగతా 5 తెరలను కూడా ఒకదానితో ఒకటి కలిపి రెండవ కూర్పుగా చేసి కూర్పు చివరన 50 కొలుకులు చేస్తారు. ఆ తర్వాత "50 బంగారు గుండీలను" చేసి వాటిని కొలుకులకు తగిలించి రెండు కూర్పుల తెరలను కలుపుతారు. ఇప్పుడు ఈ తెరలను పలకల మీద కప్పుతారు. ఈ తెరలు లోపల ఉన్నవారికి మాత్రమే కనపతాయి.
తర్వాత ఈ తెరల మీద మేక వెండ్రుకలతో చేయబడిన తెరలను గుడారంగా కప్పుతారు. ఈ మేక వెండ్రుకల తెరలు 11 ఉంటాయి. ఒక్కొక తెర పొడుగు 30 మూరలు (45 అడుగులు) వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఈ తెరలు కూడా 5 తెరలు కలిపి ఒక కూర్పుగా (coupling or set), 6 తెరలు కలిపి రెండో కూర్పుగా చేయబడతాయి. ఈ కూర్పుల తెర చివరన కొలుకులు (loops) చేస్తారు. వాటిని "యిత్తడి గుండీలతో" కలుపుతారు. తర్వాత ఈ తెరల మీద పైకప్పుగా యెర్ర రంగు వేసిన పొట్టేల తోళ్ళని, సముద్ర వత్సల తోళ్ళని కప్పుతారు.
యిది "ప్రత్యక్ష గుడారము". ఈ గుడారము లోపల పరిశుద్ద స్థలము, అతి పరిశుద్ద స్థలము అని రెండు భాగాలు ఉంటాయి. (నిర్గమ 26:1-14; 36:9-19) ప్రత్యక్ష గుడారము - ఆవరణము
చాలామంది ప్రత్యక్ష గుడారము చిన్నదిగా ఉంటుంది అనుకొంటారు. కానీ ప్రత్యక్ష గుడారము చాలా పెద్దదిగా వుంటుంది. ప్రత్యక్ష గుడారము ఆవరణము 100 మూరల పొడుగు వుంటుంది. అనగా 150 అడుగుల పొడవు ఉంటుంది. వెడల్పు 50 మూరలు అనగా 75 అడుగుల వెడల్పు వుంటుంది. యింత స్థలంలో ప్రత్యక్ష గుడారము కట్టబడుతుంది. గత భాగంలో ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కట్టబడిందో చూసాము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము ఆవరణం (compound) ఎలా కట్టారో చూద్దాము.
ఈ ప్రత్యక్ష గుడారము ఆవరణముకు 60 స్తంభములు, 60 యిత్తడి దిమ్మలను ఉపయోగించారు. దక్షిణ దిక్కున 20 స్తంభములు ఉంటాయి. ఈ 20 స్తంభాలను యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభాల బోదెలకు వెండి రేకును పొదిగిస్తారు, స్తంభాల పైకప్పును (covering of the top) బోదెలు అంటారు. ఈ స్థంభాలను కలుపుతూ వెండితో చేయబడిన "పెండె బద్దెలు" వుంటాయి. ఈ స్థంభాలకు వెండి వంకులు (hooks) వుంటాయి. ఈ వంకులకు పేనిన సన్న నారను తగిలిస్తారు... ఆవరణపు పొడుగు 100 మూరలు వుంటుంది. కనుక ఆవరణపు పొడుగుకు 100 మూరల పేనిన సన్న నార తెర వుంటుంది... అనగా ఒక్కొక్క స్తంభానికి మధ్యదూరం 5 మూరలు (7.5 అడుగులు) వుంటుంది. (20 x 5 =100). ఒక్కొక్క స్థంభం ఎత్తు 5 మూరలు, అనగా 7.5 అడుగుల ఎత్తు వుంటుంది. (నిర్గమ 27:18)
అలానే ఉత్తర దిక్కున కూడా 20 స్తంభాలను యిత్తడి దిమ్మల మీద నిలబెట్టి, ఆ స్తంభాలను పెందేబద్దలు కలిపి, ఆ స్థంభాలకు వున్న వంకులకు 100 మూరల పొడుగు గల పేనిన సన్న నారను తగిలిస్తారు.
మందిరమునకు వెనుక భాగమున 10 స్తంభాలను 10 యిత్తడి దిమ్మల మీద నిలబెట్టి, స్తంభాలను rods తో కలిపి 50 మూరల పొడుగు పేనిన సన్న నారను తగిలిస్తారు.
తూర్పు వైపున ఆవరణ ద్వారం వుంటుంది. (ప్రత్యక్ష గుడారముకు gate అన్నమాట). ఈ ద్వారం 20 మూరల వెడల్పు వుంటుంది. అనగా 30 అడుగుల వెడల్పు వుంటుంది.
సామాన్యంగా యింత పెద్ద ద్వారం దేనికి ఉండదు. కానీ ఎవరైనను, ఎందరైనను ప్రవేశించునట్టు ఈ ద్వారం వుంది. ఈ ద్వారమునకు అందమైన రంగులతో (నీల ధూమ్ర రక్తవర్ణములు) అలంకరింపబడిన తెర వుంటుంది. ఈ తెర ఎత్తు 5 మూరలు (7.5 అడుగులు). అనగా ఆవరణపు ద్వారం 30 అడుగుల వెడల్పును 7.5 అడుగుల ఎత్తు వుంటుంది. (నిర్గమ 27:18).
ఈ ఆవరణ ద్వారమునకు 4 స్తంభాలను 4 యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ 4 స్తంభములకు కూడా వెండి వంకులు ఉంటాయి. ఈ వంకులకు 20 మూరల పొడువు గల నీల ధూమ్ర రక్తవర్ణములు గల సన్న నారని తగిలిస్తారు. యిది ఆవరణపు ద్వారం. ఆవరణపు ద్వారమునకు కుడి పక్కన 3 స్తంభాలు, 3 యిత్తడి దిమ్మలు, 15 మూరల పేనిన సన్ననారని ఉపయోగిస్తారు. ఆవరణపు ద్వారము ఎడమ ప్రక్కన్న కూడా 3 స్తంభాలు, 3 యిత్తడి దిమ్మలు, 15 మూరల పేనిన సన్ననారని తగిలిస్తారు.
(note : ఆవరణపు ద్వారం యొక్క తెరకి మాత్రమే నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నార తెరను ఉపయోగించారు. ద్వారం చుట్టూ అంతా సాధారణ పేనిన సన్న నార తెరను కట్టారు)
మొత్తం ఆవరణం వెడల్పు 75 అడుగులు. ద్వారం వెడల్పు 30 అడుగులు, కుడి పక్కన 22.5 అడుగులు, ఎడమ పక్కన 22.5 అడుగులు వుంటుంది. మొత్తముగా 30 22.5 22.5=75 అడుగులు. ఈ 75 అడుగులకు 10 స్తంభాలను వాడారు. అనగా ఒక్కొక్క స్థంభం మధ్య దూరం 7.5 అడుగులు.
చివరిగా ఈ ఆవరణం స్తంభములు తమ తమ స్థానం యందు గట్టిగా ఉండుటకు నేలకు మేకులను కొట్టి, ఆ మేకులను స్తంభాలను కలుపుతూ త్రాడులు కడతారు. యిది మొత్తం ప్రత్యక్షపు గుడారము కట్టబడిన విధానం.
Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget