Halloween Costume ideas 2015

Two women with confidence

ధైర్యంగల ఇద్దరు స్త్రీలు


ఇశ్రాయేలీయులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు యెహోవాకు మొరపెట్టుకున్నారు. వాళ్ళకు సహాయం చేయడానికి ధైర్యంగల నాయకులను ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా వాళ్ళ ప్రార్థనలకు సమాధానమిచ్చాడు. ఆ నాయకులను బైబిలు న్యాయాధిపతులు అని పిలుస్తుంది. మొదటి న్యాయాధిపతి యెహోషువ. ఆయన తరువాత వచ్చిన న్యాయాధిపతులలో కొంతమంది పేర్లు ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు. అయితే ఇశ్రాయేలుకు సహాయం చేసినవారిలో దెబోరా, యాయేలు అనే ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు.

బారాకుతో మాట్లాడుతున్న దెబోరా
దెబోరా ఒక ప్రవక్త్రిని. యెహోవా ఆమెకు భవిష్యత్తును గురించిన విషయాలు తెలియజేసేవాడు, యెహోవా చెప్పిన దానిని ఆమె ప్రజలకు తెలియజేసేది. దెబోరా ఒక న్యాయాధిపతి కూడా. ఆమె కొండప్రాంతంలో ఒక ఈత చెట్టు క్రింద కూర్చొని ఉండేది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం కోసం ఆమె దగ్గరకు వచ్చేవారు.
ఆ సమయంలో కనానును యాబీను రాజు పరిపాలించేవాడు. అతనికి 900 యుద్ధ రథాలు ఉండేవి. యాబీను సైన్యం ఎంతో బలమైనది కాబట్టి అతను చాలామంది ఇశ్రాయేలీయులను బలవంతంగా దాసులుగా చేసుకున్నాడు. యాబీను రాజు సైన్యాధిపతి పేరు సీసెరా.
ఒకరోజు దెబోరా న్యాయాధిపతియైన బారాకును పిలిపించి, ‘ “నువ్వు 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ దగ్గరకు వెళ్ళు. నేను అక్కడ నీ దగ్గరకు సీసెరాను రప్పిస్తాను. అతనిపై అతని సైన్యంపై నేను నీకు విజయం కలుగజేస్తాను” అని యెహోవా చెప్పాడు’ అని తెలియజేసింది.
బారాకు దెబోరాతో, ‘నువ్వు కూడా నాతో వస్తే నేను వెళ్తాను’ అన్నాడు. దెబోరా బారాకుతో వెళ్ళింది. అయితే ఆమె బారాకుతో, ‘ఈ విజయానికి నువ్వు ఘనత పొందవు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగిస్తాడు’ అని చెప్పింది. చివరకు అలాగే జరిగింది.
బారాకు తాబోరు కొండపైనుండి దిగి సీసెరా సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. యెహోవా అకస్మాత్తుగా వరద రప్పించినప్పుడు శత్రు సైన్యంలోని అనేకులు మునిగిపోయారు. అప్పుడు సీసెరా రథం దిగి పరుగెత్తి పారిపోయాడు.

బారాకు, యాయేలు, సీసెరా
కొంతసేపటి తరువాత సీసెరా యాయేలు గుడారం దగ్గరకు వెళ్ళాడు. ఆమె అతనిని లోపలికి ఆహ్వానించి త్రాగడానికి కొంచెం పాలిచ్చింది. అది అతనికి నిద్రమత్తు కలిగేలా చేసింది కాబట్టి అతను వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు గుడారపు మేకును తీసుకొని ఆ చెడ్డ వ్యక్తి కణతలో దిగగొట్టింది. తర్వాత బారాకు రాగానే ఆమె చనిపోయిన సీసెరాను ఆయనకు చూపించింది! చూశారా, దెబోరా చెప్పినట్లే జరిగింది.
చివరకు యాబీను రాజు కూడా చంపబడ్డాడు. కొంతకాలంవరకూ ఇశ్రాయేలీయులు మళ్ళీ సమాధానంతో జీవించారు.
న్యాయాధిపతులు 2:14-22; 4:1-24; 5:1-31.


ప్రశ్నలు

  • న్యాయాధిపతులు ఎవరు, వాళ్ళలో కొంతమంది పేర్లేమిటి?
  • దెబోరాకు ఎలాంటి ప్రత్యేకమైన ఆధిక్యత ఉండేది, దానికి సంబంధించి ఆమె ఏమేమి చేస్తుండేది?
  • యాబీను రాజు మరియు ఆయన సైన్యాధిపతి సీసెరా ఇశ్రాయేలుకు ప్రమాదంగా తయారైనప్పుడు, దెబోరా న్యాయాధిపతియైన బారాకుకు యెహోవానుండి వచ్చిన ఏ సందేశాన్ని తెలియజేసింది, దాని కోసం ఎవరు ఘనతను పొందుతారని ఆమె చెప్పింది?
  • తాను ధైర్యంగల స్త్రీనని యాయేలు ఎలా చూపించింది?
  • యాబీను రాజు చనిపోయిన తర్వాత ఏమి జరిగింది?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 2:14-22 చదవండి.
    ఇశ్రాయేలీయులు తమపైకి యెహోవా కోపాన్ని ఎలా తెచ్చుకున్నారు, మనం దానినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 2:20; సామె. 3:1, 2; యెహె. 18:21-23)
  • న్యాయాధిపతులు 4:1-24 చదవండి.
    దెబోరా యాయేలుల ఉదాహరణల నుండి నేటి క్రైస్తవ స్త్రీలు విశ్వాసానికి, ధైర్యానికి సంబంధించిన ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? (న్యాయా. 4:4, 8, 9, 14, 21, 22; సామె. 31:30; 1 కొరిం. 16:13)
  • న్యాయాధిపతులు 5:1-31 చదవండి.
    బారాకు దెబోరాలు పాడిన విజయ గీతాన్ని రానున్న అర్మగిద్దోను యుద్ధం గురించిన ప్రార్థనగా ఎలా అన్వయించవచ్చు? (న్యాయా. 5:3, 31; 1 దిన. 16:8-10; ప్రక. 7:9, 10; 16:16; 19:19-21)

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget