Halloween Costume ideas 2015

The crossing of the Red Sea

ఎర్ర సముద్రాన్ని దాటడం

ఇక్కడ ఏమి జరుగుతుందో చూడండి! తన కర్రను ఎర్ర సముద్రంపైకి ఎత్తి చూపుతున్న వ్యక్తి మోషే. ఆయనతోపాటు సురక్షితంగా ఒడ్డున ఉన్నవారు ఇశ్రాయేలీయులు. ఫరోతోపాటు అతని సైన్యమంతా సముద్రంలో మునిగిపోతున్నారు. అది ఎలా జరిగిందో చూద్దాం.
మునిగిపోతున్న ఐగుప్తు సైన్యం
మనం తెలుసుకున్నట్లు, దేవుడు ఐగుప్తుమీదకు పదవ తెగులు రప్పించగానే ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు విడిచి పొమ్మని చెప్పాడు. దాదాపు 6,00,000 మంది ఇశ్రాయేలు పురుషులు, వాళ్లతో స్త్రీలు, పిల్లలు బయలుదేరారు. యెహోవాపై విశ్వాసం ఉంచిన అనేకమంది అన్యులు కూడా ఇశ్రాయేలీయులతోపాటు ఐగుప్తును విడిచిపెట్టారు. వాళ్ళందరూ తమతోపాటు తమ గొర్రెలను మేకలను ఇతర పశువులను కూడా తీసుకొని బయలుదేరారు.
ఇశ్రాయేలీయులు అలా విడిచి వచ్చేముందు వస్త్రాలను, వెండి బంగారు వస్తువులను ఇవ్వమని ఐగుప్తీయులను అడిగారు. ఐగుప్తీయులు తమపైకి వచ్చిన చివరి తెగులునుబట్టి చాలా భయపడిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీయులు అడిగిన వాటన్నింటిని వాళ్ళు ఇచ్చేశారు.
కొద్దిరోజుల తర్వాత ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి, అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఈ లోగా ఫరో, అతని మనుష్యులు ‘మన సేవకులను పోనిచ్చామే!’ అనుకుంటూ ఇశ్రాయేలీయులను పంపించినందుకు బాధపడడం మొదలుపెట్టారు.
కాబట్టి ఫరో మరోసారి తన మనసు మార్చుకున్నాడు. ఆయన త్వరగా తన రథాన్ని, సైన్యాన్ని సిద్ధం చేసుకొని, 600 ప్రత్యేక రథాలతోను, ఇతర ఐగుప్తు రథాలతోను ఇశ్రాయేలీయులను వెంబడించాడు.
ఫరో తన సైన్యంతోపాటు తమ వెనుక రావడం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో భయపడ్డారు. వాళ్ళు తప్పించుకొని పారిపోవడానికి మార్గమేమీ కనిపించలేదు. వాళ్ళకు ఒకవైపు ఎర్ర సముద్రముంది, మరోవైపు ఐగుప్తీయులు వస్తున్నారు. అయితే యెహోవా ఐగుప్తీయులకు, తన ప్రజలకు మధ్య ఒక మేఘాన్ని ఉంచాడు. కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులపై దాడిచేయడానికి వాళ్ళను చూడలేకపోయారు.
అప్పుడు యెహోవా మోషేతో ఎర్ర సముద్రమువైపు తన కర్రను ఎత్తి చూపించమన్నాడు. మోషే అలా చేయగానే యెహోవా పెద్ద తూర్పు గాలి వీచేలా చేశాడు. సముద్రంలోని నీళ్ళు రెండు పాయలుగా విడిపోయాయి. రెండువైపులా నీళ్ళు అలాగే నిలబడిపోయాయి.
అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రంలోని ఆరిన నేలమీద నడవడం ప్రారంభించారు. లక్షలాదిమంది తమ పశువులతో సముద్రము గుండా నడిచి అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టింది. చివరకు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను మళ్ళీ చూడగలిగారు. తమ దాసులు తప్పించుకొని వెళ్ళిపోవడం వాళ్ళకు కనిపించింది! వెంటనే వాళ్ళు కూడా సముద్రంలోకి దిగారు.
అలా వారు దిగగానే దేవుడు వారి రథ చక్రాలు ఊడిపోయేలా చేశాడు. ఐగుప్తీయులు భయపడి ‘యెహోవా ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడనుండి తప్పించుకొనిపోదాము రండి!’ అని కేకలు వేయడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది.
మీరు చిత్రంలో చూస్తున్నట్లు ఆ సమయంలోనే యెహోవా మోషేతో తన కర్రను ఎర్ర సముద్రము వైపు ఎత్తిచూపమన్నాడు. మోషే అలా చేయగానే గోడలవలె నిలిచిన నీరు తిరిగి ఏకమై ఐగుప్తీయులను వారి రథాలను ముంచేసింది. ఇశ్రాయేలీయులను వెంబడిస్తున్న సైన్యమంతా సముద్రంలో మునిగిపోయింది. ఐగుప్తీయులలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు!
దేవుని ప్రజలంతా తాము కాపాడబడినందుకు ఎంత సంతోషించారో! ‘యెహోవా జయించాడు. గుర్రములను వాటి రౌతులను ఆయన సముద్రములో పడద్రోశాడు’ అని పురుషులు యెహోవాకు స్తుతిగీతము పాడారు. మోషే అక్క మిర్యాము తంబుర తీసుకోగానే ఇతర స్త్రీలు కూడా తమ తంబురలను తీసుకొని ఆనందంతో నాట్యమాడుతూ, ‘యెహోవా జయించాడు. గుర్రములను వాటి రౌతులను ఆయన సముద్రములో పడద్రోశాడు’ అంటూ పురుషులు పాడిన పాటనే పాడారు.
నిర్గమకాండము 12 నుండి 15 అధ్యాయాలు.


ప్రశ్నలు

  • స్త్రీలు పిల్లలతోపాటు ఎంతమంది ఇశ్రాయేలు పురుషులు ఐగుప్తును విడిచిపెట్టారు, వాళ్ళతోపాటు ఎవరు కూడా వెళ్ళారు?
  • ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చిన తర్వాత ఫరోకు ఏమనిపించింది, ఆయన ఏమి చేశాడు?
  • ఐగుప్తీయులు తన ప్రజలపై దాడి చేయకుండా ఉండడానికి యెహోవా ఏమి చేశాడు?
  • మోషే తన కర్రను ఎర్ర సముద్రంవైపు ఎత్తినప్పుడు ఏమి జరిగింది, ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?
  • ఇశ్రాయేలీయుల వెనుక ఐగుప్తీయులు కూడా సముద్రంలోకి వచ్చినప్పుడు ఏమి జరిగింది?
  • తాము రక్షించబడినందుకు సంతోషంగా ఉన్నామని, యెహోవాపట్ల కృతజ్ఞతతో ఉన్నామని ఇశ్రాయేలీయులు ఎలా చూపించారు?

అదనపు ప్రశ్నలు

  • నిర్గమకాండము 12:33-36 చదవండి.
    తన ప్రజలు ఎన్నో సంవత్సరాలపాటు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నందుకు వాళ్ళకు తగిన ప్రతిఫలం లభించేలా యెహోవా ఎలా చూశాడు? (నిర్గ. 3:21, 22; 12:35, 36)
  • నిర్గమకాండము 14:1-31 చదవండి.
    నేడు యెహోవా సేవకులు రానున్న అర్మగిద్దోను కోసం ఎదురు చూస్తుండగా, నిర్గమకాండము 14:13, 14లో నమోదు చేయబడిన మోషే మాటలు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (2 దిన. 20:17; కీర్త. 91:8)
  • నిర్గమకాండము 15:1-8, 20, 21 చదవండి.
    యెహోవా సేవకులు ఆయనకు స్తుతిగీతాలు ఎందుకు పాడాలి? (నిర్గ. 15:1, 2; కీర్త. 105:2, 3; ప్రక. 15:3, 4)
    ఎర్ర సముద్రం దగ్గర మిర్యాము, ఇతర స్త్రీలు యెహోవాను స్తుతించడంలో నేటి క్రైస్తవ స్త్రీల కోసం ఎలాంటి మాదిరిని ఉంచారు? (నిర్గ. 15:20, 21; కీర్త. 68:11)

Post a Comment

blogger
disqus
facebook

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget